- అనంత-రాజధాని ఎక్స్‌ప్రెస్‌వేకు మంగళం
- ఇప్పుడు పులివెందుల బాట
- తెరపైకి విజయవాడ-బెంగళూరు రోడ్డు
- కేంద్రం గ్రీన్‌సిగ్నల్
- రూ. 10వేల కోట్లతో ప్రాజెక్టు
- భూ సేకరణ వ్యయం 800 కోట్లనే
- డీపీఆర్‌లో అలైన్మెంట్ రూట్‌మ్యాప్
నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై సీఎం జగన్మోహన్రెడ్డికి ఇంకా కక్ష తీరినట్లు లేదు. రాయలసీమను అమరావతికి అనుసంధానించే అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు స్వస్తి పలికారు. ఇప్పుడు తన వ్యవసాయ ఎస్టేట్ ఉన్న కడప జిల్లా ఇడుపులపాయ మీదుగా పులివెందుల నుంచి బెంగళూరుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే కట్టాలని సంకల్పించారు.
ఈ అలైన్మెంట్ ప్రతిపాదనకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (ఎంఓఆర్టీహెచ్) ఆమోదం తెలిపింది. అయితే, వయా ఇడుపుల పాయ అనేది ఇప్పుడే ప్రకటించరు. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు ద్వారా దానిని అధికారికం చేస్తారు. ఈ దిశగా అధికారులు కసరత్తుచేస్తున్నారు.
భారతమాల ఫేజ్-2లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. విజయవాడ నుంచి గుంటూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల మీదుగా బెంగళూరుకు ఈ కొత్త జాతీయ రహదారిని ప్రతిపాదించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే జాతీయ రహదారి ఉంది. దాన్ని కనెక్ట్చేస్తూ ప్రకాశం జిల్లా మీదుగా మైదుకూరు, కడప, వేంపల్లి, పులివెందుల, కదిరి చిక్బళ్లాపురంలోని బెంగళూరు హైవేకి అనుసంధానిస్తూ కొత్తగా రహదారి నిర్మాణం చేయాలని కేంద్రాన్ని కోరారు. ప్రతిపాదించిన అనతికాలంలోనే కేంద్రం నుంచి సానకూల స్పందన వచ్చింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారని తెలిసింది. కడప జిల్లా ఎంపీలు ఇదే అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి సమగ్ర ప్రజంటేషన్ ఇప్పించినట్లు తెలిసింది. ఇటీవల ఆర్అండ్బీ అధికారులు కూడా ఢిల్లీకి వెళ్లి ఎంఓఆర్టీహెచ్ అధికారులను కలిసి ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో ఎక్స్‌ప్రెస్‌వేకు ఆ శాఖ ఆమోదముద్ర వేసింది.
ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 10వేల కోట్లపైనే. ఇందులో భూ సేకరణ వ్యయం 790 కోట్లమేర ఉంటుందని అధికార వర్గాల ప్రాథమిక అంచనా. ప్రస్తతం విజయవాడ-బెంగళూరు మధ్య 570 కిమీ మేర దూరం ఉంది. తాజా ప్రతిపాదనతో ఇప్పటికే ఉన్న హైవేలను కలుపుతూ కొత్తగా 365 కిమీ మేర నాలుగు వరసల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేని నిర్మిస్తారు.
ఈ రహదారి వల్ల కడప, ప్రకాశం జిల్లాల మధ్య జాతీయ రహదారి కనెక్టివిటీ వస్తుంది. భూ సేకరణ భారం 790 కోట్లు కూడా తామే భరిస్తామని కేంద్రం ముందుకొచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
వయా ఇడుపులపాయ..
కడప నుంచి పులివెందులకు.. ఇడుపులపాయ నుంచి పులివెందులకూ నాలుగు వరుసల రహదార్లు ఉన్నాయి. విజయవాడ-బెంగళూరు హైవేను కడప నుంచి వేంపల్లికి తీసుకొచ్చి అక్కడి నుంచి ఇడుపులపాయలో ఉన్న నాలుగు వరసల రహదారిని అనుసంధానం చేసి అక్కడి నుంచి పులివెందులకు ఉన్న మరో నాలుగు వరసల రహదారిని కలిపేలా డిజైన్ రూపొందించినట్లు తెలిసింది.
అటకెక్కిన అమరావతి:
అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే అటకెక్కింది. రూ.20వేల కోట్ల విలువైన ప్రాజెక్టును రాజకీయాలు చుట్టుముట్టడంతో భూ సేకరణ రూపంలో వివాదాలు ముందుకొచ్చాయి. 2 వేల కోట్ల భూ సేకరణ ఖర్చులో కనీసం వెయ్యి కోట్లయినా భరించాలని రాషా్ట్రన్ని కేంద్రం కోరింది.
తొలుత ఒప్పుకున్న సర్కారు.. రానురాను అది తమకు భారమని చెబుతోంది. ఇప్పటికే భూ సేకరణపై 3డీ నోటిఫికేషన్ జారీ చేశారు. నిధులు లేక భూ సేకరణ ముందుకు సాగడం లేదు. దీంతో ఆ ప్రాజెక్టు దాదాపుగా పక్కనపడేసినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
టెండర్ పడితే ఒట్టు != రాజధాని గ్రామాల్లో పనులకు ఆసక్తి చూపించని కాంట్రాక్టర్లు
అమరావతి మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏఎంఆర్డీఏ) పలు పనులకు పిలిచిన టెండర్లకు స్పందనేలేదు. జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల బిల్లులు తొక్కిపెట్టడంతో పనులు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు.
ఆ దెబ్బ ఏఎంఆర్డీఏ పిలిచిన టెండర్లపై పడింది. తాజాగా నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు ఆవరణలో 76,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 కోర్టు హాళ్లను రూ.29.40 కోట్ల వ్యయంతో జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మించేందుకు గత నెల 16వ తేదీన టెండర్లు పిలిచింది. కోర్టు హాళ్లను జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మించాల్సి ఉన్నా జీప్లస్ 5 స్టోర్డ్ ఫౌండేషన్‌ను వేయాలని నిర్దేశించింది. ఆర్సీ కాలమ్ ఫ్రేమ్ స్ట్రక్చర్, ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్, మెకానికల్, ఎలక్ర్టికల్, ప్లంబింగ్ (ఎంఈపీ) సర్వీసులు, లిఫ్టులు ఇతర అనుబంధ పనులను చేపట్టాలని టెండర్లలో పొందుపరిచింది.
ఆగస్టు 31 వరకు ఒక్క టెండరు కూడా పడలేదు. సెప్టెంబరు ఒకటో తేదీతో టెండర్ల గడువు ముగియగా.. అదే రోజు కేఎంవీ సంస్థ బిడ్‌ను వేసింది. మరే సంస్థా ముందుకు రాకపోవటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో తలపెట్టిన పనులను ముందుకు తీసుకువెళ్లకపోవటంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు ఆపివేయాల్సి వచ్చింది. అమరావతిని అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం లేదన్న సంకేతం బలంగా వెళ్లడంతో అరకొరగా పిలిచే టెండర్లకు కూడా స్పందన ఉండడం లేదు. అయినా హైకోర్టు ఆవరణలో కాంప్లెక్స్ నిర్మించటానికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపుతారని ఏఎంఆర్డీఏ భావించింది.
హైకోర్టు ఆవరణలో భవనాలు కాబట్టి నష్టపోయే అవకాశాలు ఉండవన్న కారణంతో అయినా టెండర్లలో పలు సంస్థలు పాలు పంచుకుంటాయని అంచనా వేసింది. కానీ, ఫలితం వేరేలా వచ్చింది. ఇదొక్కటే కాదు…రాజఽధాని ప్రాంతంలో ఏఎంఆర్డీఏ పిలిచిన పలు ఇతర టెండర్లలో కూడా ఇదే అనుభవం ఎదురయింది.
రాజధాని గ్రామాల్లో శానిటేషన్కుసంబంధించి ఆగస్టులో టెండర్లు పిలిస్తే, ఒక్కటే పడింది. వెలగపూడిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో మెకానికల్, ఎలక్ర్టికల్, ప్లంబింగ్ (ఎంఈపీ) పనుల కోసం రూ.91.5 లక్షల వ్యయంతో ఆగస్టు 8న ఏఎంఆర్డీఏ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్‌ని(ఆర్ఎఫ్పీ) పిలిచింది. ఆగస్టు 21 నాటికి కూడా టెండరు పడకపోవడంతో గడువును పొడిగించారు.
రాజధాని పరిధిలో మెయింటినెన్స్ పనులకు ఆగస్టు 24వ తేదీన ఏఎంఆర్డీఏ రూ.9.12 లక్షల వ్యయంతో టెండర్లు పిలిచింది. ఇందులో తుళ్లూరులోని జ్యుడీషియల్ కాంప్లెక్స్, చీఫ్ జస్టిస్ (సీజే), చీఫ్ సెక్రటరీ (సీఎస్) బంగళా పనుల నిర్వహణ, మంచినీటి పైపులైన్లు, సాంకేతిక సిబ్బందిని నియమించే అంశాలు ఉన్నాయి. ఈ టెండర్లకు ఈ నెల ఏడో తేదీ తుది గడువు కాగా, ఇప్పటి వరకు ఒక్కటీ పడలేదు.