ఏదైనా ఒక విషయాన్ని డైవర్ట్ చేయాలంటే దాని నుంచి ఎదుటివారి దృష్టి మరల్చేలా మరో విషయాన్ని తెరపైకి తేవాలి. ఆ విషయంలో రాజకీయ నాయకులు సిద్ధహస్తులు…అందులోనూ ఏపీ సీఎం జగన్ ఇంకా సిద్ధహస్తుడని చెప్పాలి. ఏపీలో ఓ వైపు పంచాయతీ ఎన్నికల కోసం హోరాహోరీగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో …ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వస్తున్న తరుణంలో, ఎస్ఈసీతో వైరం ఉన్న సందర్భంలో జగన్ మంచి స్కెచ్ వేశారన్న టాక్ వస్తోంది.
పంచాయతీ ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో దానిని కప్పి పుచ్చుకునేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని జగన్ తెలివిగా వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే, ఏమీ తెలియనట్టు కేంద్రానికి జగన్ లేఖ రాసి జనాల మెప్పు పొందాలని జగన్ వేసిన ప్లాన్ పై ఇపుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే, అయిపోయిన పెళ్ళికి బాజాలన్న రీతిలో…దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా….విశాఖ స్టీల్ పై జగన్ ఇప్పుడు లేఖ రాశారు.
గత ఏడాది అక్టోబర్ లోనే ప్రపంచ ఉక్కు దిగ్గజ సంస్థ పోక్సోకు విశాఖ స్టీల్స్ అమ్మాలన్న డీల్ ను జగన్ ముగించారన్న విమర్శలు వస్తున్నాయి. ఆ వ్యవహారం బయటకు పొక్కి విమర్శలు రావడం, విశాఖ స్టీల్ పై జనం తిరగబడడంతో జగన్ యూటర్న్ తీసుకొన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ జనం తిరగబడకుంటే విశాఖ ఉక్కును ఆల్రెడీ బేరం పెట్టిన జగన్….ఆ డీల్ ఫినిష్ చేసి ఉండేవారన్న ప్రచారం జరుగుతోంది. జనాల్లో వ్యతిరేకత రావడంతోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను మేమే కొంటాం.. అని మంత్రి గౌతమ్ రెడ్డితో ప్రకటన విడుదల చేయించిన జగన్…మరో పక్క కేంద్రానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మొద్దంటూ లేఖ రాసి డబుల్ గేమ్ అడుతున్నారన్న ప్రచారం జరగుతోంది.
నిజంగా విశాఖ స్టీల్స్ పై జగన్ కు ప్రేమ ఉంటే పోక్సోను ఏపీలో అడుగుపెట్టనిచ్చేవారు కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోక్సో ప్రతిపాదనకు జగన్ తెర తీయడంతోనే కేంద్రం…విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను తెచ్చిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరేలా గత ఏడాది అక్టోబర్ 29న పోస్కో ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని వారు చెప్పారు. దీంతో, కడప స్టీల్ ప్లాంట్ కు పెట్టుబడులని అంతా అనుకున్నారు.
కానీ, అసలు కథ వేరే ఉంది. విశాఖ స్టీల్ లో పోస్కోను ఎంటర్ చేసి, ఆ సంస్థకు 2 వేల ఎకరాల భూమిని కట్టబెట్టాలన్నది జగన్ ప్లాన్ అని నాడే ఊహాగానాలు వచ్చాయి. దానికి తోడు వైజాగ్ స్టీల్ డీల్ కు సంబంధించి కేంద్ర మంత్రితో కూడా జగన్ భేటీ అయ్యారని ప్రచారం జరిగింది. ఈ పాయింట్లన్నింటినీ కనెక్ట్ చేస్తే….విశాఖ స్టీల్ ను బేరంప పెట్టింది జగన్ అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అయితే, పోస్కో డీల్ పై విశాఖ స్టీల్ ఉద్యోగులు నిరసన తెలపడంతో ఆ ఫ్యాక్టరీని అమ్మాలని నీతి ఆయోగ్ తో కేంద్రం చెప్పించిందన్న టాక్ వస్తోంది.
తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ ఆధ్వర్యంలో ఉద్యమం జరిగే అవకాశముండడంతో జగన్, కేంద్రం యూటర్న్ తీసుకున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అందుకే, ఈ విషయాలన్నీ బయటకుపొక్కుండా జగన్….విశాఖ ఉక్కు మా హక్కు కూడా అంటూ …తామే దాన్ని కొంటామంటూ కొత్త పల్లవి అందుకుంది. పోక్సోకు రెడ్ కార్పెట్ పరిచారన్న విమర్శలు ఎదుర్కొంటోన్న జగన్ ఏపీ ప్రజల దృష్టిలో విలన్ కావాల్సి ఉంది. అయితే, విశాఖ స్టీల్స్ ను మేమే కొంటామంటూ హీరో అవ్వాలన్న జగన్ ఆలోచన ఎంతవరకు వర్కవుటవుతుందో వేచి చూడాలి. ఏది ఏమైనా….విశాఖ స్టీల్స్ ను బేరం పెట్టి విమర్శలు ఎదుర్కోవాల్సిన జగన్…అనుకున్న ప్లాన్ వర్కవుటయితే ప్రశంసలు అందుకునే అవకాశముంది.