ఏపీ అధికారపక్షాన్ని టార్గెట్ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తనకు వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టటం లేదు. ప్రతి విషయానికి కారణం.. వైసీపీనే అనేస్తున్నారు. మాటకు ముందు.. మాటకు తర్వాత వైసీపీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తున్న పవన్ కల్యాణ్.. వారాహి విజయయాత్ర పేరుతో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో పవన్ కల్యాణ్ కు కళ్లద్దాలు కనిపించేవి కావు. నాలుగైదేళ్లే క్రితం ప్రెస్ మీట్ల వేళలో ఆయన కళ్లద్దాల్ని వాడేవారు. తాజాగా వారాహి విజయాత్ర వేళ.. భారీ బహిరంగ సభలోనూ ఆయన కళ్లద్దాల్ని వినియోగించారు. తొలిసారి కళ్లద్దాల్ని వాడిన పవన్ కల్యాణ్.. ఆ విషయాన్ని చెబుతూ.. ‘‘ఈ మధ్యన కళ్లజోడు వేసుకోవటం ఎక్కువైపోయింది. వైసీపీ అక్రమాల గురించి.. దస్తాలు.. దస్తాలు చదివి కళ్లజోడు వచ్చేసింది’’ అని వ్యాఖ్యానించారు.
అదే పనిగా చదవటం వల్ల కళ్లజోడు వస్తుందన్నది అర్థసత్యమే. అయితే.. తన తాజా వ్యాఖ్యతో రెండు విషయాల్ని పవన్ ప్రజల మనసుల్లోనాటాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా చెప్పాలి. అందులో మొదటిది.. తాను వైసీపీ మీద చేస్తున్న ఆరోపణలు గాలి వాటంగా చేయట్లేదని.. ప్రతిదానికి లెక్కలు ఉన్నాయన్నది చెప్పటం లక్ష్యంగా కనిపిస్తోంది. వైసీపీ అక్రమాల మీద తానెంతో అధ్యయనం చేస్తున్నానని చెప్పటం ద్వారా.. గాలి వాటం వ్యాఖ్యలు చేయటం లేదన్న విషయాన్ని పరోక్షంగా చెబుతున్నారని చెప్పాలి.
తాము చేసే పనిని గొప్పగా చెప్పుకోవటం ఒక పద్దతి. అందుకు భిన్నంగా.. చేసే పనిని సూటిగా చెప్పకుండా పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పాజిటివిటీని పెంచుుకునే వ్యూహాన్నిపవన్ అమలుచేస్తున్నట్లుగా చెప్పాలి. ఇప్పుడు పవన్ కల్యాణ్ వయసు 51 సంవత్సరాలు. ఈ వయసులోకి వచ్చినప్పుడు అత్యధికులకు కళ్లద్దాలు వచ్చేస్తాయి. అందుకు పవన్ అతీతం కాదు. కానీ.. ఆ విషయాన్ని దాచేసి.. తెలివిగా వైసీపీ మీద నెపం వేసిన తెలివి చూస్తే.. పవన్ ప్రతి విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు.