ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు ఉందా లేదా? అన్న ప్రశ్న చాలాకాలంగా జనసేన, బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీతో పవన్ కు గ్యాప్ వచ్చిందని, అందుకే, ప్రధాని మోడీ హాజరైన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పవన్ రాలేదని ప్రచారం జరిగింది. దానికితోడు, కొంతకాలంగా బీజేపీ చేపట్టిన ఏ కార్యక్రమంలోనూ పవన్ హాజరు కావడం లేదు. కనీసం, బీజేపీ చేపట్టిన కార్యక్రమాలకు మద్దతుగా కనీసం ట్వీట్ కూడా చేయడం లేదు.
ఇక, సంయుక్తంగా బీజేపీ-జనసేనలు ఓ కార్యక్రమం చేపట్టిన దాఖలాలు ఈ మధ్యకాలంలో అయితే లేవు. ఈ నేపథ్యంలోనే బీజేపీతో జనసేన కటీఫ్ చెప్పబోతోందన్న పుకార్లకు చెక్ పెట్టేలా జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ఒకే వేదికపై కనిపించారు. విశాఖ ఎపిసోడ్ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు బీజేపీ నేతలు అండగా నిలిచారు. విజయవాడలో పవన్ ను కలిసిన సోము ఆయనకు సంఘీభావం ప్రకటించారు.
అంతేకాదు, పవన్ నిర్వహించిన మీడియా సమావేశం అనంతరం ఈ ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే తనకు మద్దతు తెలిపిన బీజేపీ నేతలకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖలో ఘటన ప్రభుత్వ కుట్ర అని , సన్నాసులు ఏదో వాగుతారని, వారి గురించి పట్టించుకోనవసరంలేదని పవన్ అభిప్రాయపడ్డారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతో ముందుకు సాగుతామని అన్నారు.
విశాఖలో వైసీపీ గర్జన ప్రభుత్వం స్పాన్సర్ చేసిన కార్యక్రమం అని సోము ఆరోపించారు. ఆ కార్యక్రమానికి స్పందన లేదని, అందుకే వైసీపీ నేతలు తీవ్ర అసహనానికి గురై జనసేనపై కుట్రకు తెరతీశారని సోము సంచలన ఆరోపణలు చేశారు. మిత్రపక్షం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించానని సోము వెల్లడించారు. వ్యక్తిగత దూషణలతో మొదలైన వైసీపీ ప్రస్థానం, పోలీసులను అడ్డంపెట్టుకుని వ్యక్తిగత స్వేచ్ఛను హరించే స్థాయికి చేరిన తీరును ప్రజలు గమనిస్తున్నారని వివరించారు.
వైసీపీ కుట్రలను జనం గమనిస్తున్నారనని, అంతిమంగా ప్రజాక్షేత్రంలో తీర్పును ప్రభుత్వాలు నిలువరించలేవని హితవు పలికారు. ఏది ఏమైనా వైజాగ్ ఘటనతో పవన్ కు విపరీతమైన మైలేజీని తెచ్చిపెట్టిన జగన్…బీజేపీతో జనసేనక ప్యాచప్ చేసి పెట్టారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.