తమ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. తమ పథకాలను పక్క రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని, జగన్ వంటి పాలన మరే సీఎం అందిచడం లేదని డప్పు కొడుతున్నారు. దేశంలోని సీఎంలలో జగనన్నే నెంబర్ వన్ అంటూ ప్రకటించేసకుంటున్నారు. అయితే, వాస్తవం మాత్రం కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ మాటేదే ప్రతిపక్షాలు అక్కసుతో అంటోంది కాదు. అక్షరాలా ప్రఖ్యాత సంస్థ సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ స్టడీస్ (సీఎన్ఓఎస్) గణాంకాలతో సహా వెల్లడించిన వాస్తవాలివి.
తాజాగా ఆ సంస్థ చేపట్టిన సర్వేలో జగన్ కు షాక్ తగిలింది. జనాదరణలో జగన్ ఢమాల్ అయ్యారని, తాజా సర్వేలో ఏపీ సీఎం దాదాపు అట్టడుగున నిలిచారని ఆ సంస్థ వెల్లడించింది. ప్రజాదరణ కలిగిన నాయకులు ఎవరనే అంశంపై ప్రఖ్యాత సంస్థ సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ స్టడీస్ (సీఎన్ఓఎస్) నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ప్రధాని మోదీతోపాటు 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులను జనం ఏ విధంగా ఆదరిస్తున్నారనే విషయం తెలుసుకునేందుకు నిర్వహించిన సర్వేలో జగన్ కు ఝలక్ తగిలింది. ఈ సర్వేలో జగన్ 20వ స్థానంలో నిలిచారు. అంటే, జాబితాలో అట్టడుగు నుంచి ఆరో స్థానంలో అన్నమాట.
రాష్ట్రంలో 39 శాతం మంది మాత్రమే జగన్ నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారని సర్వేలో వెల్లడి కావడం వైసీపీ శ్రేణులకు షాకిచ్చింది. జగన్ పై 29 శాతం మంది అసంతృప్తి వెలిబుచ్చారని, మిగిలిన 32 శాతం మంది తటస్థంగా ఉండిపోయారని సర్వేలో వెల్లడైంది. ఇక, ఇదే జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ 11వ స్థానంలో నిలువగా…మొదటి స్థానంలో ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. ఆ రాష్ట్రంలో 70 శాతం ప్రజలు ఆయన నాయకత్వంపై పూర్తి సంతృప్తితో ఉన్నారు. మరో, 19 శాతం మందే అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత రెండేళ్లుగా జగన్ పాలనపై తీవ్ర విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. అందినకాడికి అప్పులు చేసుకుంటూ పోతోన్న జగన్…చివరకు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్ గ్రాఫ్ నానాటికీ పడిపోతోందన్న టాక్ వచ్చింది. ఆ టాక్ కు తగ్గట్లుగానే తాజాగా వెల్లడైన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడికావడం విశేషం.