రెండు తెలుగు రాష్ట్రాల్లో 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీలోనూ.. తెలంగాణలో నూ.. అధికారికంగా జరిగిన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌లు.. ప్రజలను ఉద్దేశించి ప్రసం గించారు. అయితే.. రెండు రాష్ట్రాలకు సంబంధించివ్యత్యాసం మాత్రం స్పష్టంగా కనిపించింది. ఇద్దరు ముఖ్యమంత్రులు.. తమ మనసులోని మాటలను దాచుకోలేక పోయారు. అటు ఏపీలో ముఖ్యమంత్రి జగన్.. తన పాలనకు తనే సర్టిఫికెట్లు ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.
తన పాలనపై తనే పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. ఇటు కేసీఆర్.. మాత్రం..యథాలాపంగా కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఈ పర్వదినాన కూడా.. ఈ ఇద్దరు నేతలు మారలేదనే టాక్ వినిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి స్వోత్కర్షలు.. తెలంగాణ ముఖ్యమంత్రి పరనిందలతోనే ఈ కార్యక్రమం ముగిసిపోవడం గమనార్హం.
ఏపీ సీఎం ఏమన్నారంటే..
1వ తేదీన సూర్యోదయానికి ముందే అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు వారి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్మాణింగ్ చెప్పి మరీ… ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా, 2.7 లక్షల మంది వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళే వ్యవస్థ ఏర్పాటు చేశాం!
ప్రతి 2000 మందికి పౌర సేవలు అందించే గ్రామ/వార్డు సచివాలయం; అక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే రైతులకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్ని విధాలా సహాయం చేసే రైతు భరోసా కేంద్రాలు… అక్కడినుంచి మరో నాలుగు అడుగులు వేస్తే కనిపించే వైఎస్సార్ విలేజి క్లినిక్‌లు… ఇంకో నాలుగు అడుగులు వేస్తే కనిపించే ఇంగ్లీష్ మీడియం స్కూల్..
మరో నాలుగు అడుగుల దూరంలోనే మీ గ్రామంలోనే నిర్మాణం కాబోతున్న డిజిటల్ గ్రంథాలయాలు, మరో నాలుగు అడుగుల దూరంలో ఇంగ్లీష్ లో బోధించే ప్రీ ప్రెమరీలు, ఫౌండేషన్ స్కూళ్ళు… ప్రతి మండలానికీ ఒక అధునాతన 108, ప్రతి పీహెచ్సీకీ ఒక అధునాతన 104… అందులో ఇద్దరు డాక్టర్లు; వీరిని విలేజి క్లినిక్‌తో అనుసంధానించి అమలు కానున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్… ఇవన్నీ గడచిన 75 ఏళ్ళలో కాదు… కేవలం ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం తీసుకువచ్చిన మార్పులు!
కేసీఆర్ దూకుడు తగ్గలేదు!
రాజ్యాంగవేత్తల స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సమాఖ్య విధానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటమే కాకుండా.. రాష్ట్రాల స్వేచ్ఛను కాలరాస్తూ దిల్లీలోని భాజపా సర్కారు నిరకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లే.. దేశప్రజలు అన్నిరకాలుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఎడాపెడా… పన్నుల భారం మోపడం.. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కొర్రీలు పెడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రఅప్పులపై కొందరు ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని.. ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చట్టం పరిమితికి లోబడే రాష్ట్రప్రభుత్వం అప్పులు తెస్తోందని పునరుద్ఘాటించారు.
Comments 1