ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పోలిస్తే.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డినే ఎక్కువసార్లు ఢిల్లీకి వెళతారన్న పేరుంది. తాజాగా మరోసారి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. కాకుంటే.. ఈసారి సదస్సు ఢిల్లీ పెద్దలతో భేటీ అయ్యేందుకు కాదని.. సదస్సులో పాల్గొనటానికి అని చెబుతున్నారు.
ఈ రోజు (శనివారం) ఉత్తరాంధ్రకు వెళుతున్నఆయన.. సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నట్లుగా చెబుతున్నారు. ఎప్పటి మాదిరే ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ పర్యటన సాగుతుందని చెబుతున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వేళలో తాడేపల్లి నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం 3.40 గంటలకు అముదాలవలసకు చేరుకోనున్నారు. అక్కడి జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ కు హెలికాఫ్టర్ లో వెళ్లనున్న ఆయన.. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారామ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరు కానున్నారు.
పెళ్లి వేడుకులకు హాజరైన అనంతరం తిరిగి విశాఖపట్నం చేరుకోనున్నారు.శనివారం సాయంత్రం 5. 20 గంటల ప్రాంతంలో విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. గంటన్నర వ్యవధిలో ఢిల్లీకి చేరుకునే ఆయన.. రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఆదివారం ఉదయం రాష్ట్రపతి భవన్ కు చేరుకోనున్న ఆయన.. ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు.
ఆ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా ఎయిర్ పోర్టుకు రానున్న జగన్.. రాత్రి 8.15 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నట్లు చెబుతున్నారు.