ప్రస్తుతం ఏపీలో ప్రమాణాల హవా కొనసాగుతోంది. కొంతకాలంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తనపై జగన్ రెడ్డి చేస్తున్న, చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవమని, సింహాద్రి అప్పన్నపై ప్రమాణం చెయ్యడానికి సిద్ధమని జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. ప్రమాణం చేయడానికి జగన్ రెడ్డి సిద్ధమా? అని లోకేష్ ప్రశ్నించారు. దీనికి జగన్ కు బదులుగా విజయసాయిరెడ్డి స్పందించారు. తాను అప్పన్న సన్నిధికి వస్తానని, చర్చకు సిద్ధమని, చర్చకు తేదీ చెప్పాలని విజయసాయిరెడ్డి చెప్పారు. దీంతో, తాజాగా విజయసాయిరెడ్డిపై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. 420 జగన్‌రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి?’ అని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. ఏ1 కి దమ్ము, ధైర్యం లేదా?, దైవం మీద ప్రమాణం అనగానే తోకముడిచి చర్చ అంటూ పారిపోతున్నారు? అని ఎద్దేవా చేశారు. వైసీపీ ఆరోపణల్లో బురద రాజకీయం తప్ప నిజం లేదని దుయ్యబట్టారు.
అంతకుముందు జగన్ పై లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబు రామతీర్థం పర్యటనను లారీలతో అడ్డుకోవడాన్ని ఆయన ఖండించారు. లారీలు కాదు జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్నా తమ అధినేత రామతీర్థం పర్యటనను అడ్డుకోలేడని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని అడ్డుకోలేని సీఎం, విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోలేని పోలీసులు కలిసి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి లారీలు అడ్డంగా పెట్టారని విమర్శించారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత బయటకి వెళ్లకుండా గతంలో గేటుకి తాళ్ళు కట్టారని, ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారని లోకేష్ విమర్శించారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డూ, అదుపూ లేదంటూ లోకేష్ ట్వీట్ చేశారు. దైవం మీద ప్రమాణం అనగానే తోకముడిచి చర్చ అంటూ పారిపోతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు మరోసారి సవాల్ చేస్తున్నానని, తనపై జగన్ రెడ్డి చేస్తున్న, చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవం అని సింహాద్రి అప్పనపై ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, మరి జగన్ సిద్ధమా? అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. మరి, రెండోసారి లోకేష్ విసిరిన సవాల్ కు జగన్ స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.