వారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఛోటా అభ్యర్థులు. ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్ ఎన్నిక ల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే…అధికార వైసీపీలో ఇతర అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం లభించినా.. బ్రాహ్మణ సామాజిక వర్గానికి మాత్రం అసలు ప్రాధాన్యమే దక్కలేదు. రాష్ట్రంలో కనీసం ఒకటి రెండు వార్డు సభ్యులకు కూడా వైసీపీ ఎక్కడా బీఫారం లు ఇవ్వలేదు.అసలు పోటీలో కూడా పెట్టిన పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లోనూ వారిని పక్కన పెట్టేసింది.
అయితే.. తెనాలి మునిసిపాలిటీ పరిధిలో వైసీపీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోయినా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇద్దరు బ్రాహ్మణ అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. ఇక్కడ మొత్తం 40 వార్డులు ఉంటే.. రెండు చోట్ల వారికి అవకాశం కల్పించింది. ఈ క్రమంలో స్థానికంగా మంచి పేరున్న ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సత్యనారాయణ టీడీపీ ఇచ్చిన బీఫాం పై ఇక్కడ మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.. ఈయన వయసు 68 ఏళ్లు. అదేవిధంగా మరో బ్రాహ్మణ మహిళకు కూడా అవకాశం ఇచ్చారు. అయితే.. వైసీపీ ఇక్కడ ఎలాగైనా సరే… పట్టు సాధించాలనే ఉద్దేశంతో టీడీపీ అభ్యర్థులపై సామదాన భేద దండోపాయాలను ప్రదర్శిస్తోంది.
ఈ క్రమంలో.. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకొనేలా వివిధ మార్గాల్లో ఒత్తిడి తెచ్చింది. 11వ వార్డు మహిళా అభ్యర్థి భర్త పై స్థానిక పోలీసులను ఉపయోగించి.. బైండోవర్ కేసులు నమోదు చేయించేందుకు ప్రయత్నించింది. అయితే.. విషయం తెలిసిన బ్రాహ్మణ కమ్యూనిటీ దీనిని ఎదిరించింది. ఎందుకు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని ప్రశ్నించింది. బ్రాహ్మణులు ఏమన్నా.. రౌడీలా? వీరిపై ఏమైనా నేరచరిత్ర ఉందా? గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అని నాయకులు నిలదీయడంతో పోలీసులు వెనక్కి తగ్గారు..
అయితే.. ఇంతలోనే డాక్టర్ సత్యనారాయణపై కూడా బైండోవర్ కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కానిస్టేబుల్ను ఇంటికి పంపి.. ఆయనపై కేసు పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తీవ్రస్థాయిలో వివాదానికి దారితీసింది. బైండోవర్ కేసు ఎలా పెడతారంటూ.. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు.. “మీరు బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వరు. ఇచ్చిన పార్టీ తరఫున పోటీ చేస్తుంటే.. ఇలా లొంగ దీసుకునేందుకు ప్రయత్నం చేస్తారా? ఈ ప్రభుత్వం బ్రాహ్మణ వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది“ అంటూ… నిప్పులు చెరిగారు.
ఇదే సమయంలో స్థానికంగా బ్రాహ్మణ సామాజిక వర్గంపై జరుగుతున్న దాడులను, అధికార పార్టీ దాష్టీకాన న్నీ వారు ఎండగట్టారు. ఎన్నికల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న బ్రాహ్మణ కార్యకర్త కొర్లిమర్ల చంద్రమోహన్పై చైర్మన్ యార్డ్ కమిటీ చైర్మన్ భర్త దాడి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. ధార్మిక వ్యతిరేక ప్రభుత్వం అనడానికి ఇదే సాక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో వైకుంఠపురంలో శ్రీవారి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకునే శంకు చక్రాలను కూలగొట్టారని, ఎందుకు కూల్చారో ఎవరూ చెప్పలేదని.. దుర్గగుడిలో ఏసీబీ దాడులు జరిగినా..ఈవోను తొలగించలేదని, శ్రీశైలంలోనూ దాడులు జరిగాయని నిప్పులు చెరిగారు. బ్రాహ్మణ వ్యతిరేక, హిందూ వ్యతిరేక ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ ధర్మంపైనా.. ధార్మిక సంస్థలపైనా.. ఆలయాలపైనా ఏ రేంజ్లో దాడులు జరుగుతున్నాయో.. అందరికీ తెలిసిందే. తిరుపతిలో మతప్రచారం నుంచి బెజవాడ దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాల మాయం.. అంతర్వేది రథం దగ్ధం.. రామతీర్థం ఘటన వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా బ్రాహ్మణ సామాజికవర్గాని కి చెందిన వారిపై దాడులు జరుగుతుండడం పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలను వినియోగించి పోటీ నుంచి తప్పుకొనేలా వారిపై వత్తిళ్లు తీసుకురావడం వంటివి.. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఇక, ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే.. గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినన నాయకుడు కావడం గమనార్హం. మరి ఆయన సొంత జిల్లాలోనే ఇలా దాడులు జరుగుతున్నా.. మౌనంగా ఉండడాన్ని బ్రాహ్మణ సామాజిక వర్గం విమర్శిస్తుండడం గమనార్హం.