జనసేన పార్టీ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. టీడీపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ పరిధిలో ఉందా.. లేక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగన్ ట్యాక్స్ పరిధిలో ఉందా? అని ప్రశ్నించింది. టీటీడీ వెబ్ సైట్లో దర్శనం, గదులు బుక్ చేసుకున్న భక్తులకు షాక్ తగులుతోందని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. దర్శన టికెట్లకు తీసుకోవాల్సిన డబ్బులకంటే టీటీడీ అధికంగా వసూలు చేస్తున్నారని తెలిపారు.
టీటీడీ జీఎస్టీ పరిధిలో ఉందా? లేక.. జగన్ ట్యాక్స్ పరిధిలో ఉందా? అని ప్రశ్నించారు. టీటీడీ వెబ్ సైట్‌ను వెంటనే క్లోజ్ చేసి కొత్త వెబ్ సైట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా టీటీడీ అధికారులు ఎందుకు స్పందించ డం లేదని నిలదీశారు. భక్తుల నుంచి అధిక వసూళ్లపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్రపై అనుమానం ఉందని అన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టే టీటీడీ ఈఓ ధర్మారెడ్డి దీనిపై ఏం సమాధానం చెబుతారని అడిగారు.
టీటీడీ కేసులు పెట్టడం, మంత్రులతో సిఫార్సులు చేయించుకోవడం మానుకుని భక్తులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాల ని జనసేన నేత కిరణ్ రాయల్ హితవుపలికారు. ఏం జరిగిందంటే.. ఇటీవల వెబ్సైట్లో రూమ్‌లు బుక్ చేసుకున్న వారి నుంచి అదనంగా కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో తాజాగా జనసేన రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చే అంశంపై పరిశీలిస్తోంది. ఈ క్రమంలో కిరణ్ రాయల్ తాజాగా తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.