అంతకంతకూ ఎక్కువ అవుతున్న కరోనా కేసులు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ఇంతకాలం దేశంలో అతి వేగంగా కరోనా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు లేవు. కానీ.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ చూస్తే.. ఆ కొరత తీరిపోయేలా పరిస్థితి ఉందన్న అభిప్రాయం కలుగుక మానదు. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత భారీగా కేసుల నమోదైనట్లుగా ఈ రోజు (శనివారం) ఉదయం విడుదల చేసిన బులిటెన్ స్పష్టం చేస్తోంది.
నెల క్రితం వరకు వందలోపు కేసులు మాత్రమే నమోదయ్యే తెలంగాణలో వందల్లో కేసులు రావటం.. వెయ్యి అంకెను దాటకపోవటం తెలిసిందే. మార్చి చివర్లో వెయ్యి కేసులు దాటేయగా.. ఈ నెలలో మాత్రం రోజురోజుకు నమోదవుతున్న పాజిటివ్ కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఈ రోజు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 4446 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా వెల్లడైంది.
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ వెల్లడించింది. కరోనా బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా.. కోలుకునే వారి మధ్య అంతరం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. నాలుగున్నరే వల వరకు పాజిటివ్ కేసులు నమోదైతే.. దాని బారి నుంచి కోలుకున్న వారు పదిహేను వందల లోపే ఉండటం గమనార్హం. తాజాగా నమోదైన పాజిటివ్ లతో కలిపి తెలంగాణ వ్యాప్తంగా 33,514కు చేరుకుంది. వీరిలో 22,118 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
మొదటి దశలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే ప్రతి వంద కేసుల్లో సింహభాగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యేవి. అందుకు భిన్నంగా సెకండ్ వేవ్ లో మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తక్కువగా నమోదవుతున్నట్లుగా బులిటెన్ లో పేర్కొనటం గమనార్హం. తాజా రిపోర్టును చూస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 598 కేసులు మాత్రమే నమోదైనట్లుగా స్పష్టం చేస్తున్నారు. వాస్తవం ఇంతకంటే ఎక్కువ కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. అధికారిక సమాచారం ప్రకారం మాత్రం కేసుల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. మొన్నటివరకు లక్ష లోపే ఉన్న కేసులు.. రెండు రోజుల క్రితం రోజులో రెండు లక్షల కేసులకు చేరుకోగా.. తాజాగా విడుదల చేసిన బులిటెన్ ప్రకారం శుక్రవారం ఒక్కరోజులోనే దేశ వ్యాప్తంగా 2.34లక్షల మంది పాజిటివ్ గా తేలినట్లు చెబుతున్నారు. ఇది ఇప్పటివరకు నమోదైన కేసులకు సంబంధించి ఒక రికార్డుగా చెబుతున్నారు. తాజాగా వెల్లడైన పాజిటివ్ కేసులతో కలుపుకొని యాక్టివ్ గా ఉన్న కేసుల్ని చూస్తే.. దేశ వ్యాప్తంగా 16.79లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది.