విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో దీనిని గట్టిగా అడ్డుకునేందుకు ప్రయత్నించాల్సిన ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. దీనిని కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నారా? కేవలం ఒక లేఖ రాసి.. సరిపెట్టడం ద్వారా.. మున్ముందు.. `నేను లేఖ కూడా రాశాను.. ప్రతిపక్ష నేతలు అది కూడా చేయలేదు` అని ప్రచారం చేసుకునేందుకు పరిమితం కానున్నారా? అంటే.. అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. అత్యంత కీలకమైన ప్రత్యేక హోదాను ఎలాగూ సంపాయించే పరిస్థితి లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో ఉన్న విశాఖ ఉక్కును కూడా నిలబెట్టుకోకపోతే.. రేపు తెలుగు జాతికి ఏం చెబుతారనేది కీలక ప్రశ్న. విస్తృత ప్రజాప్రయోజనం , రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన అవస రం.. బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి మరింత ఎక్కువ ఉంటుంది. అయితే.. ఈ విషయంలో కంటితుడుపు చర్యలు, రాజకీయ కారణాలు వెతుక్కోవడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ చట్టాలనే తీసుకుంటే.. ఊరూ వాడా వీటిని వద్దని గోల పెడుతున్నా. నెలల తరబడి రైతన్నలు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నా.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెవిని పెట్టడం లేదు.
మరి అలాంటిది.. విశాఖ ఉక్కు విషయంలో కేవలం లేఖలకు లొంగుతారా? అనేది కీలక ప్రశ్న. ఏదో మొక్కు బడిగా లేఖ రాసి.. వదులుకుంటే.. ఉక్కు పరిశ్రమ నిలబడుతుందా? ఈ సమయంలోనూ భేషజాలను భుజానేసుకుని ముందుకు సాగుతున్నారనే ధోరణి బలంగా వినిపిస్తోంది. ఇలాంటి సమస్య పొరుగు రాష్ట్రాల్లో తలెత్తినప్పుడు.. అధికార ప్రతిపక్షాలు ఏకమైన సందర్భాలు అనేకం ఉన్నాయి. కావేరీ సమస్య వచ్చినప్పుడు తమిళనాడులో బద్ధ శత్రువులైన అధికార ప్రతిపక్షాలు.. ఏఐఏడీఎంకే, డీఎంకేలుఒకే తాటిపైకి వచ్చి.. పార్లమెంటులో పోరాడాయి. కర్ణాటకలోనూ ఇదే తరహా పరిస్థితి ఉంది. కానీ, మన దగ్గర మాత్రం ఎంత సమస్య వచ్చినా.. మిన్ను విరిగి మీదపడుతున్నా.. పార్టీలకు, నేతలకు స్వార్థ రాజకీయాలే తప్ప.. మరొకటి కనిపించడం లేదనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.