హైదరాబాద్లోని పాతబస్తీలో కొత్త తరహా వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. పేద యువతులు, మహిళలను టార్గెట్ చేసి…పేదరికం, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకున్న ఓ దళారీ బండారం బట్టబయలైంది. నిస్సహాయులైన మహిళలను ఎంపిక చేసుకొని వారి న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీసి వారి పర్సనాలిటీని బట్టి రేటు ఫిక్స్ చేసే సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఓ సామాజిక కార్యకర్తతో పాటు చాంద్రాయణగుట్ట ఎస్సైలు ఈ వ్యభిచార ముఠా ఆటకట్టించారు.
కర్ణాటకలోని బీదర్ కు చెందిన సయ్యద్ హుస్సేన్ గతంలో లారీ డ్రైవర్ గా పని చేసేవాడు. కర్ణాటకలోని కలబురిగిలో వ్యభిచార గృహాలు మెయింటైన్ చేసే గులాంకు హుస్సేన్ ప్రధాన అనుచరుడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి యువతులను తీసుకురావాలని గులాం ఆదేశించడంతో హుస్సేన్ పాతబస్తీకి చేరాడు. తన బావ చేసే పాడు పనుల గురించి అవగాహన లేని హుస్సేన్ మరదలు తన ఇంట్లో గదిని అతడికి అద్దెకు ఇచ్చింది.
ఆ తర్వాత ఫలక్ నుమాకు చెందిన ఓ మహిళతో కలిసి యువతులకు, మహిళలకు గాలం వేసేందుకు ప్రయత్నించేవాడు. తనకు మంత్ర, తంత్ర విద్యలు తెలుసని, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తానని మాయమాటలు చెప్పి వారికి గాలం వేసేవాడు. ఆ తర్వాత వారి ముఖం, పాదాలు కనిపించకుండా మిగిలిన శరీర భాగాలను న్యూడ్ గా ఫోటోలు, వీడియోలు తీసేవాడు. వాటిని గులాంకు వాట్సాప్ ద్వారా పంపి ఆ మహిళల శరీరాకృతి ఆధారంగా రేట్ ఫిక్స్ చేసేవాడు.
ఇలా వారం రోజుల్లో పదిమంది మహిళల వివరాలు గులాంకు చేరవేసినట్టు, వారిలో ఇద్దరు పాతబస్తీకి చెందినవారిగా తెలుస్తోంది. అయితే, బాధితురాలు ఒకరు హుస్సేన్ ఆగడాలను ఓ సామాజిక కార్యకర్త దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమె పోలీసుల సహాయంతో ఈ ముఠా గుట్టురట్టు చేసింది. హుస్సేన్ ను అదుపులోకి తీసుకొని అతడి ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు.