ఏపీ అధికార పార్టీ వైసీపీ వ్యవహారం రోజుకో విధంగా భ్రష్టు పడుతోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఒకవిధంగా భ్రష్టుపడుతుంటే.. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు మరో విధంగా భ్రష్టు పడుతున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. అద్భుతమైన పాలన అందిస్తున్నానని.. తనలాంటి ముఖ్యమంత్రి గతంలో లేడని చెప్పుకొంటున్న సీఎం జగన్ కు నిజంగానే పాలనపై పట్టు లభించిందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ప్రజలకు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి.. అంతా బాగానే ఉందని ఆయన అనుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇది నిజమేనని ఇటీవల ఇంటిలిజెన్స్ కూడా నివేదిక సమర్పించినట్టు తెలిసింది.
రాష్ట్ర పరిపాలనకంటే.. కూడా ఎక్కువ సమయంలో తన వ్యక్తిగత కేసుల నుంచి బయటపడేందుకు, నిధులు కేటాయించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అదేసమయంలో తనకు వ్యతిరేకంగా ఉన్న కమ్మ సామాజిక వర్గంపై కసి తీర్చుకునేందుకు ఆయన రోజుకో వ్యూహాన్ని తెరమీదికి తెస్తున్నారని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. “వారిపై ఉన్న శ్రద్ధ.. మా నాయకుడు పావలా వంతు మాపై పెడితే.. బాగుండు!“ అని ఇటీవల ఒకరిద్దరు నాయకులు ఆఫ్ ది రికార్డుగా మీడియా ముందు చెప్పడం గమనార్హం. న్యాయవ్యవస్థపై పోరు కోసం.. ఏకంగా వారం రోజులు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పగించారని వారు చెబితే.. రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వేసింది.
సో.. జగన్ వైఖరి ఇలా ఉంది. ఇక, నేతల విషయానికి వస్తే.. చేతిలో చిల్లిగవ్వలేదు. ఏ పనిచేయాలన్నా కూడా సొంత నిధులు లేదా ఎమ్మెల్యేగా వస్తున్న జీతం తప్ప.. వారికంటూ.. ఏమీ ఆదాయం లేదు. వ్యాపారాలున్నవారు సరే. ఇవి లేనివారి పరిస్థితి ఏంటి? ఒకప్పుడు వైసీపీ కార్యాలయాలు అనుచరులు, కార్యకర్తలతో కోలాహలంగా ఉండేవి. ఇప్పుడు బోసిపోతున్నాయి. దీనికి కారణం.. ఎమ్మెల్యేలు ఖర్చు చేయలేక పోవడమే.
పోనీ.. నియోజకవర్గం అభివృద్ధి నిధులు ఇచ్చినా.. ఎంతో కొంత చేతి ఖర్చుకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ, అది కూడా లేకుండా పోయింది. చిన్నపాటి పనుల కాంట్రాక్టులను కూడా మంత్రులు చేజిక్కించుకుంటున్నారు. దీంతో దాదాపు 50కి పైగా నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాలను దక్కించుకుంటున్న వర్గాలపై ఎమ్మెల్యేలు వాలిపోతున్నారని తెలుస్తోంది.
వలంటీర్లను తమ కనుసన్నల్లో పెట్టుకుని.. భారీ ఎత్తున లబ్ధి పొందే భరోసా, వాహనమిత్ర లబ్ధి దారుల నుంచి `ఎంతో కొంత` వసూలు చేసి ఇవ్వాలనే టార్గెట్ లు పెడుతున్నారట. వీటికి లొంగని వలంటీర్లను ఏదో వంక పెట్టి.. ఇంటికి పంపేస్తున్నారని వలంటీర్లు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పదిహేను రోజుల్లో 30 వేల మంది వలంటీర్లు స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదిలేశారు. “ఈ ఒత్తిడి మేం భరించలేం“ అని వారు బాహాటంగా చెబుతున్నారు. ఒత్తిడి ఏమిటని ఆరాతీస్తే.. వసూళ్లే ఒత్తిడి.. అంటూ.. వారు వాపోతున్నారు. ఏదేమైనా జగన్ అలా.. నేతలు ఇలా.. ఉండడంతో పార్టీపై వ్యతిరేకత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.