వైసీపీ అధినేత జగన్ విషయంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఎన్నికలకు ముందు.. ఆయనకు ఒకింత వ్యతిరేకంగా ఉన్న మేధావి వర్గాలు.. తర్వాత తర్వాత.. జగన్ విషయంలో పాజిటివిటీ పెంచుకున్నారని వార్తలు వచ్చాయి. అంటే.. ఒక నిబద్ధతతో కూడిన పాలన అందిస్తారనే విషయంలో ఎక్కడో వారికి ఓ ఆవగింజంత నమ్మకం కుదిరిందనే వ్యాఖ్యలు వినిపించాయి. పైగా పార్టీని అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. నిలబెట్టిన తీరు.. ప్రజా సంకల్ప పాదయాత్రతో ముందుకు సాగిన విధానం వంటివి సదరు మేధావులను కట్టిపడేసిందని వార్తలు వచ్చాయి.
దీంతో జగన్కు మద్దతుగా మారడంతోపాటు.. కొందరు ఆయన పార్టీలోకి నేరుగా చేరాలని కూడా అనుకు న్నారని ప్రచారం జరిగింది. ఇలాంటి వారిలో జనసేన తరఫున విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్, రాజకీయ విశ్లేషకులు.. తుర్లపాటి కుటుంబరావు(జగన్కు మద్దతుగా వాయిస్ వినిపించాలని అనుకున్నారు).. ఇలా చాలా మంది మేధావులు, సీనియర్లు జగన్ కు మద్దతుగా నిలవాలని భావించారు. ఇంకొందరు పార్టీలోకి వచ్చేయాలని అనుకున్నారు.
వాస్తవానికి వీరంతా కూడా గత ఏడాది ఎన్నికలకు ముందు జగన్ను విమర్శించిన వారే. జగన్పై ఉన్న కేసులను చూపించి.. ఆయనపై విరుచుకుపడ్డవారే. అయితే, ఎందుకో.. ఏమిటో.. తెలియ దు కానీ.. అనూహ్యంగా జగన్పై సింపతీ పెరిగింది. దీంతో వైసీపీ పరిణామాలు సంపూర్ణంగా మారిపోవడం ఖాయమని, ఇప్పటి వరకు ఓ వర్గం వారికే పరిమితమైన పార్టీ.. ఇక అందరి పార్టీగా మన్ననలు అందుకుం టుందని అనుకున్నారు. కానీ.. ఇంతలోనే వారంతా మౌనం పాటించారు.
కొన్నాళ్ల కిందటి వరకు జగన్ సర్కారుకు మద్దతుగా వ్యాసాలు రాసిన.. కుటుంబరావు వంటివారు పెన్ను మూసేశారు. ఇక, జేడీ లక్ష్మీనారాయణ ఉలుకు పలుకు లేకుండా పోయారు. మిగిలిన వారిలోనూ ఇప్పుడు జగన్పై ఒక విధమైన ఏహ్య భావం కలుగుతున్నదనే వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. “జగన్ చేస్తున్న పనులు హుందాగా లేవు“- అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఒక వ్యవస్థతో కాదు.. రాజ్యాంగ బద్ధమైన అన్ని వ్యవస్థలతోనూ జగన్ అనుసరిస్తున్న వైఖరిని వీరు కూడా తప్పుపడు తున్నారు. ఈ కారణంగానే మేధావి వర్గాలుగా పేరుపడ్డ వారు ఇప్పుడు జగన్కు దూరంగా ఉంటున్నారని.. కుదిరితే ఆయనతో కలిసి నడవాలని అనుకున్నవారు కూడా డిస్టెన్స్ పాటిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. సో.. ఇదీ సంగతి!!జగన్కు మేధావులు జై కొడదామనుకున్నారు.. కానీ!!