కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు హామీని సీఎం జగన్ నిలబెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 10న ఉద్యోగులంతా మిలియన్ మార్చ్ చేపట్టి తీరుతామని హెచ్చరించిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలను మంత్రుల కమిటీతో చర్చలకు మంత్రి బొత్స ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లిన ఉద్యోగులు…బొత్సకు షాకిచ్చారు.
గతలో మాదిరిగానే సీపీఎస్ రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రుల కమిటీ…దాని స్థానంలో జీపీఎస్ అమలు చేస్తామని పాత పాటే పాడింది. గతంలోనే ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్యోగ సంఘాల నేతలు…తాజాగా మరోసారి అదే ముచ్చటి చెప్పడంతో చర్చల నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు. మంత్రుల కమిటీతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయని మీడియాకు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఇలా ఉద్యోగ సంఘాల నేతలు మంత్రులతో చర్చల మధ్యలో రావడంతో బొత్సకు ఘోర అవమానం జరిగినట్లయింది.
మరోవైపు, జీపీఎస్‌పై మాట్లాడేందుకైతే అసలు చర్చలకు పిలవొద్దని ఏపీసీపీఎస్యూఎస్ అధ్యక్షుడు మరియదాస్ తేల్చి చెప్పారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పై చర్చలకు మాత్రమే తాము వెళ్లామని, కానీ, మంత్రులంతా తమను జీపీఎస్ ట్రాక్‌లోకి రావాలని చెప్పారని వెల్లడించారు. పాత పింఛను విధానానికి ప్రభుత్వం ఏ మాత్రం సుముఖంగా లేదని మంత్రులు చెప్పారని, ఆ మాత్రం దానికి ప్రతిసారీ చర్చలకు పిలవడం దేనికి అంటూ మండిపడ్డారు.
వేలాది మంది సీపీఎస్‌యూఎస్ నాయకులు, టీచర్లపై కేసులు పెట్టారని, బైండోవర్ నోటీసులిచ్చారని, వాటిని రద్దు చేయాలని డీజీపీని కోరతామని అన్నారు. సెప్టెంబర్ 1న పోలీసులు తమ ఇళ్లు ముట్టడించారని, మహిళా ఉద్యోగులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.