అద్భుతాల్ని సాధించినా అందుకు తగ్గ పేరు ప్రఖ్యాతులు రాని ప్రభుత్వ రంగ సంస్థల్లో భారత వైద్య పరిశోధక మండలి అలియాస్ ఐసీఎంఆర్ ఒకటి. ప్రపంచాన్ని వణికేలా చేసిన కరోనా మహమ్మారికి సురక్షితమైన టీకాను తయారీలో కీలకభూమిక పోషించిన ఐసీఎంఆర్.. తాజాగా మరో అద్భుతానికి అడుగు దూరంలో నిలిచింది. సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా.. పిల్లలు వద్దని భావించే వారికి సంతాన నిరోధక ఉత్పత్తులపై పరిమితుల గురించి తెలిసిందే. వీటిల్లో అత్యధికం మహిళల్ని ఇబ్బంది పెట్టేలా ఉంటాయి. దీంతో.. సంతానం వద్దనుకుంటే ఆడోళ్లకే పనిష్ మెంట్ ఎందుకు? మగాళ్లకు ఏమీ ఉండదా? అన్న విరుపు వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఐసీఎంఆర్ డెవలప్ చేసిన ఒక ఇంజెక్షన్ సంతాన నిరోధానికి పర్ ఫెక్టుగా పని చేస్తుందని చెబుతున్నారు.
దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేయటం ఆసక్తికరంగా మారింది. రివర్సిబుల్ ఇన్ హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ గా పిలిచే ఇంజెక్షన్ సురక్షితమని స్పష్టం చేస్తున్నారు. గర్భనివారణలో ఇది 99.02 శాతం సమర్థంగా పని చేస్తుందన్న విషయాన్ని వెల్లడించింది.
అంతేకాదు.. దీని వాడకం వల్ల తీవ్రస్థాయి దుష్ఫ్రభావాలు ఉండవని స్పష్టం చేసింది. డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనుమతితో 25-40 ఏళ్ల మధ్య ఉన్న 303 మంది ఆరోగ్యవంతులపై ఢిల్లీ.. ఉధంపూర్.. లుదియానా.. జైపూర్.. ఖరగ్ పుర్ లకు చెందిన పలువురి మీద మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసింది. వీరంతా తమ భార్యలకు బదులుగా కుటుంబ నియంత్రణ కోసం వచ్చిన పురుషుల మీద ఈ ఇంజెక్షన్ ను ప్రయోగించారు. ఫలితం పాజిటివ్ గా రావటమే కాదు.. మరో అడుగు దూరంలో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉంది.
ఈ ఇంజెక్షన్ ను హర్మోనల్ ఇంజెక్షన్ల మాదిరి రక్తనాళాలకు ఎక్కించాల్సిన అవసరం లేదు. శరీర భాగానికి సాధారణంగా ఇంజెక్టు చేస్తే సరిపోతుంది. ఈ ఇంజెక్షన్ తో పిల్లలు వద్దనుకున్నప్పుడు వినియోగించటమే కాదు.. సంతానం కావాలని అనుకున్నప్పుడు కూడా పొందేందుకు వీలుందని చెబుతున్నారు. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఒక్కో పురుషుడికి 60 మిల్లీ గ్రాముల ఆర్ ఐఎస్ యూజీని ఇంజెక్షన్ రూపంలో ఇచ్చారు. దీని ప్రభావంతో వీరిలో వీర్య కణాల నియంత్రణ సాధించటంతో 97.3 శాతం సమర్థత కనిపించగా.. గర్భనివారణలో 99.02 శాతం సమర్థంగా పని చేసింది. ఏమైనా.. సంతానం వద్దనుకున్న వారికి తాజా ఆవిష్కరణ ఒక గొప్ప వరంగా మాత్రం చెప్పక తప్పదు.