ప్రతి దానికి ఆధార్ లింక్ చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వ నిబంధనాలు.. ప్రతి ముఖ్యమైన పనికి ఆధార్ కావాల్సిందేనంటూ షరతులు. ఇలా దేశంలోని ప్రజల ఆర్థిక వ్యవహారాలతో సహా కీలక సమాచారమంతా కేంద్రం చేతుల్లోనే ఉంది. ప్రతి దానికి ఆధార్‌తో ముడి పెట్టడంతో అది ఎంతో కీలకంగా మారింది. పొరపాటున కానీ ఆ ఆధార్ సమాచారం బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఇక అంతే సంగతి.
ఈ విషయంపై ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజల ఆధార్ సమాచారం సురక్షితంగానే ఉంటుందా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అవి మరింతగా పెరిగాయి. అందుకు స్వయంగా ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురి కావడమే కారణం. ఓ దేశానికి ప్రధాని అయిన మోడీకే దిక్కులేదు.. ఇక దేశ ప్రజల సమాచారాన్ని ఎలా రక్షిస్తారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
మోడీ వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఆదివారం కొంత సమయం పాటు హ్యాకింగ్‌కు గురైంది. ఆ ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు.. చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే కరెన్సీగా బిట్‌కాయిన్‌ను భారత్ అధికారికంగా ఆమోదించిందని, ఆ దేశం 500 బిట్కాయిన్లు కొనుగోలు చేసిందని వాటిని ప్రజలందరికీ పంచనుందని ట్వీట్ చేశారు. దీంతో పాటు ఓ లింక్ కూడా పోస్ట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కొంత సమయానికి తిరిగి ఖాతాను పునరుద్ధరించిన ట్విట్టర్.. హ్యాకర్లు పోస్టు చేసిన ట్వీట్‌ను తొలగించింది.
ఇక ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రధాని ఖాతానే రక్షించుకోలేని ప్రభుత్వం ఇక ప్రజల ఆధార్ డేటాను ఎలా కాపాడుతుందని కాంగ్రెస్ ప్రశ్నించింది. మోదీ ఖాతా నుంచి బిట్ కాయిన్లను హ్యాకర్లు అమ్ముతుంటే.. కాపలాదారుడు ఎక్కడ ఉన్నారంటూ ఎద్దేవా చేసింది. మన సైబర్ భద్రత ఏ స్థితిలో ఉందో తెలియడానికి ఈ ఘటన నిదర్శనమని శివసేన పేర్కొంది.