తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. అటు రెండు జాతీయ పార్టీలు.. ఇటు జాతీయ పార్టీగా మారుతోన్న ప్రాంతీయ పార్టీ మధ్య ఎన్నికల సమరం సాగుతోంది. మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంటే.. అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ కష్టపడుతున్నాయి.
ముఖ్యంగా కాంగ్రెస్ కు తెలంగాణలో సానుకూల పవనాలు వీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటనకు విశేష ఆదరణ దక్కుతోంది. ఇవన్నీ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయానికి సంకేతాలు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్నికలకు ముందు పార్టీల్లోకి నాయకుల జంపింగ్ లు సాధారణమే. కానీ గెలిచే పార్టీలోకి వెళ్లేందుకే నాయకులు పోటీ పడతారనడంలో సందేహం లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతుందనేందుకు ఇదే సూచిక అన్నది విశ్లేషకుల మాట.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ను పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు వరుసగా రెండు సార్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పై సహజంగానే ప్రజల్లో అంతో కొంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యతిరేకత ఇప్పుడు కాంగ్రెస్ కు వరంగా మారుతోందనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ తీవ్రంగా కష్టపడుతోంది. హైకమాండ్ కూడా తెలంగాణ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
బీఆర్ఎస్ ను కంగు తినిపించి హస్తం పార్టీ జెండా ఎగరేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారనే చెప్పాలి. 2014 ఎన్నికల తర్వాత, 2018 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లోకి నాయకులు అధిక సంఖ్యలో చేరారు. ఇప్పుడా పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. అందుకే ఈ సారి కాంగ్రెస్ పక్కాగా గెలుస్తుందని చెబుతున్నారు.