ఐన్ స్టీన్…ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్త. ప్రపంచంలో మేధస్సును, తెలివితేటలను పోల్చాలంటే ఐన్ స్టీన్ పేరే ముందుగా గుర్తుకు వస్తుందంటే అతిశయోక్తి కాదు. అయితే, ప్రపంచంలోని పలు దేశాల్లో ఎంతోమంది ఐన్ స్టీన్ వారసులు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. కొందరు చిన్నారులు పదేళ్లకే డాక్టర్ పట్టా పుచ్చుకుంటుంటే….మరి కొందరు గణిత శాస్త్రంలో అద్భుతాలు చేస్తున్నారు. అమెరికాలో నివసిస్తోన్న 11 ఏళ్ల భారత సంతతి చిన్నారి కూడా ఈ కోవలోకే వస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత తెలివైన వారి జాబితాలో భారత్ సంతతి చిన్నారి నటాషా పెరి చోటు దక్కించుకొని ఔరా అనిపించింది. ప్రపంచంలోని అత్యంత తెలివైనవారిలో ఆ చిన్నారి ఒకరని అమెరికాలోని ప్రతిష్టాత్మక జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ కితాబిచ్చింది. 11 ఏళ్ల పసిప్రాయంలో నటాషా అత్యంత కఠినమైన పరీక్షల్లో అదరగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. న్యూజెర్సీలోని థెల్మా ఎల్ శాండ్మియర్ ఎలిమెంటరీ స్కూల్ లో చదువుతోన్న నటాషా…జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ ట్యాలెంటెడ్ యూత్ (సీటీవై) నిర్వహించే టాలెంట్ సెర్చ్ లో పాల్గొంది.
సీటీవై నిర్వహించే ప్రతిష్ఠాత్మక స్కాలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ (శాట్), అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (యాక్ట్)లో నటాషా అద్భుతం చేసింది. అమెరికాలో కాలేజీల ప్రవేశాల కోసం ప్రామాణికంగా తీసుకొనే ఈ పరీక్షలకు 84 దేశాలకు చెందిన 19 వేల మంది హాజరయ్యారు. జనవరిలో జరిగిన ఈ పరీక్షలకు ‘గ్రేడ్ 5 (ఐదో తరగతి)’ చదువుతున్న నటాషా హాజరై…అడ్వాన్స్ డ్ గ్రేడ్ 8కు నిర్వహించే పరీక్షలకు సమానంగా 90 శాతం మార్కులు సాధించింది. దీంతో ఆమెను సీటీవై ‘హై ఆనర్స్ అవార్డ్స్’కు ఎంపిక చేసింది. ఈ విజయంతో తాను మరింత స్ఫూర్తి పొందానని, భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధిస్తానని నటాషా ధీమా వ్యక్తం చేసింది.