భారత పురుషుల హాకీ జట్టు అద్భుతం చేసింది. ఒలింపిక్స్‌లో హాకీ పతకం కోసం నాలుగు దశాబ్దాలకు పైగా నిరీక్షిస్తున్న అభిమానులను ఎట్టకేలకు సంతోషంలో ముంచెత్తింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచింది. గురువారం టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీలో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-4తో జర్మనీపై విజయం సాధించింది. ఒలింపిక్స్‌లో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా ఏకంగా ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించిన ఘన చరిత్ర మన హాకీ జట్టుది.
చివరగా 1980లో భారత్ స్వర్ణం చేజిక్కించుకుంది. భారత్‌కు ఒలింపిక్స్‌లో అదే చివరి పతకం కూడా. ఆ తర్వాత ప్రతిసారీ కనీసం కాంస్యం కూడా లేక భారత్ వెనుదిరుగుతూనే ఉంది. గత కొన్ని ఒలింపిక్స్‌లో అయితే పతకం గురించి ఆలోచించే పరిస్థితే ఉండట్లేదు. భారత జట్టు ప్రదర్శన అంతగా పడిపోయింది.
ఐతే ఈసారి ఒలింపిక్స్ ముంగిట వివిధ టోర్నీల్లో చక్కటి ప్రదర్శనతో భారత జట్టు పతకంపై ఆశలు రేపింది. లీగ్ దశలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ మినహా అన్నింట్లో గెలిచి క్వార్టర్స్‌కు దూసుకొచ్చింది. అక్కడా విజయం సాధించి సెమీస్ చేరుకుంది.
కానీ సెమీఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతిలో ఓడి ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. ఐతే హోరాహోరీగా సాగిన కాంస్య పతక పోరులో మాత్రం భారత ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించారు. సిమ్రన్ జీత్ సింగ్ 17, 34 నిమిషాల్లో గోల్స్ కొడితే.. హార్దిక్ సింగ్ 27వ నిమిషంలో, హర్మన్ ప్రీత్ సింగ్ 29వ నిమిషంలో, రూపిందర్ పాల్ సింగ్ 31 నిమిషంలో గోల్స్ సాధించి భారత్‌కు 5-3తో తిరుగులేని ఆధిక్యాన్నందించారు. ఐతే నాలుగో క్వార్టర్లో జర్మనీ గోల్ కొట్టడంతో ఉత్కంఠ మొదలైంది. చివరి నిమిషాల్లో గోల్స్ ఇచ్చి ఓటమి కొని తెచ్చుకునే అలవాటును హాకీ జట్టు పునరావృతం చేస్తుందేమో అన్న భయం కలిగింది. కానీ ఈసారి మన జట్టు ఆ తప్పు చేయలేదు. పట్టుదలతో ఆడి మ్యాచ్‌ను సొంతం చేసుకుని కాంస్యం సొంతం చేసుకుంది.