కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 232 యాప్స్‌ను నిషేధిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. వీటిలో ప్రధానంగా లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్‌లు ఉండడం గమనార్హం. ఇటీవల దేశవ్యాప్తంగా రుణాలు తీసుకుని.. ఇచ్చిన వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా చైనా మూలాలున్న 138 బెట్టింగ్ యాప్స్, 94 లోప్ యాప్‌లపై నిషేధం విధించింది.
అదేసమయంలో మరికొన్నింటిని బ్లాక్ చేయాలని నిర్ణయించింది. మొత్తం 232 యాప్స్‌పై తక్షణ, అత్యవసర ప్రాతిపదికన ఈ చర్యకు సిద్ధమైనట్టు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ వర్గాలు తెలిపాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 69 కింద భారత సార్వభౌమత్వం, సమగ్రత పట్ల పక్షపాతంగా వ్యవహరించే ఉద్దేశాలను ఈ యాప్‌లలో గుర్తించడంతో ఈ చర్య తీసుకున్నట్టు సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఈ యాప్‌లను చైనా పౌరులే రూపొందించారని, భారత్‌లో ఇక్కడేవారినే డైరెక్టర్లుగా నియమించుకున్నారని కేంద్రం గుర్తించింది.
కాగా లోన్ యాప్‌లు అమాయకులను రుణాల పేరిట దోపిడీకి గురిచేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. భారీ వడ్డీ రేట్లు విధిస్తున్నాయి. ఆ వడ్డీలను చెల్లించలేని రుణగ్రస్థులను యాప్‌ల ప్రతినిధులు వేధింపులకు గురిచేస్తున్నారు. అసభ్యకరమైన సందేశాలను పంపిస్తున్నారు. రుణాలు తిరిగి చెల్లించకపోతే మార్ఫింగ్ చేసిన ఫొటోలను కాంటాక్ట్ నంబర్లకు పంపించి అవమానానికి గురిచేస్తున్నాయని ఐటీ మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
పలువురు బాధితులు ఆత్మహత్యలకు పాల్పడిన పలు ఘటనలు వెలుగుచూశాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసింది. దీంతో చైనా యాప్‌లకు ఇక ముకుతాడు వేసినట్టేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.