రూ.వెయ్యి కోట్ల ఆస్తిపరులు, బిలియనీర్ల కేరాఫ్ అన్నంతనే.. అంత సొమ్ములు మనకెక్కడ? ఏ టాటాకో.. బిర్లాకో ఉంటాయే తప్పించి మామూలోళ్లకు ఎక్కడవన్న మాట వినిపించేది. అది పాతికేళ్ల క్రితం. ఇప్పుడు ట్రెండ్ మారింది. అప్పటివరకు సాదాసీదాగా ఉండి.. ఒక్క ఐడియాతో వందలాది కోట్ల సంపాదించేటోళ్లు ఎక్కువ అయిపోయారు. ఇకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో ఎక్కడో.. అట్టడుగు స్థానంలో మనోళ్లు ఉండేవారు. ఇప్పుడు సినిమా మారింది. టాప్ టెన్ లో ఒకరు కచ్ఛితంగా.. టాప్ 100 పలువురు చోటు దక్కించుకుంటున్నారు.
ఇటీవల విడుదలైన ఐఐఎఫ్ఎల్ హురన్ ఇండియా రిచ్ లిస్టు నివేదికను చూసినోళ్లు ఆశ్చర్యపోవటమే కాదు.. ఆసక్తికర అంశాలు కొన్ని బయటకు వచ్చాయి. వెయ్యికోట్లకు పైగా ఆస్తులు ఉన్న వారిలో 178 మంది చిన్న పట్టణాలకు చెందిన వారన్న విషయం తాజా నివేదిక స్పష్టం చేసింది. రూ.వెయ్యి కోట్ల సంపద ఉన్న వారు 1103 మందిగా లెక్కలు తేలిస్తే వారిలో 178 మంది చిన్నపట్టణాలకు చెందిన వారు ఉండటం కొత్త పరిణామంగా చెప్పాలి. ఈ మొత్తం 178 మందికి ఉన్న సంపదన ఎంతో తెలుసా? అక్షరాల రూ.6.37 లక్షల కోట్లు.
పట్టణ ప్రాంతానికి చెందిన బిలియనీర్లలో అత్యధికులు గుజరాత్ లో ఉన్నారు. తర్వాతిస్థానం తమిళనాడుకు దక్కింది. పట్టణ ప్రాంతానికి చెందిన బిలియనీర్ల విషయానికి వచ్చినప్పుడు మన తెలుగు రాష్ట్రాల మాటేమిటి అంటే..ఏపీకి చెందిన వారు నాలుగు పట్టణాల్లో ఆరుగురు బిలియనీర్లు ఉన్నట్లుగా తేలింది. తెలంగాణ విషయానికి వస్తే అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరంగా మారింది. హైదరాబాద్ లో 64 మంది బిలియనీర్లు ఉన్నారు. చెన్నై కంటే ఎక్కువగా.. బెంగళూరు మహానగరం కంటే కాస్త తక్కువగా ఉండటం గమనార్హం.
నివేదిక వెల్లడించిన మరిన్ని వివరాల్ని చూస్తే..
– ఏపీ విషయానికి వస్తే విశాఖలో అత్యధికంగా ముగ్గురు బిలియనీర్లు ఉన్నారు. ఆ ముగ్గురు సంపద రూ.7100 కోట్లు.
– పశ్చిమ గోదావరి జిల్లా బీమవరంలో రూ.వెయ్యి కోట్లతో ఒకరు.. విజయవాడలో రూ.3600 కోట్లతో ఒకరు.. తిరుపతిలో రూ.2800 కోట్ల సంపదతో మరొకరు ఉన్నారు.
– దేశంలోని నగరాల విషయానికి వస్తే.. దేశ రాజధాని ఢిల్లీ కంటే వాణిజ్య రాజధాని ముంబయిలోనే అత్యధిక బిలియనీర్లు ఉన్నారు. ముంబయిలో 283 మంది ఉంటే.. ఢిల్లీలో 185 మంది ఉన్నారు. బెంగళూరులో 89 మంది ఉన్నారు.
– పట్టణ ప్రాంతంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న ప్రాంతం సూరత్ 19 మంది బిలియనీర్లు ఉన్నారు. రెండో స్థానంలో తమిళనాడులోని కోయంబత్తూరు నిలచింది. ఇక్కడ 14 మంది ఉన్నారు. వీరి మొత్తం సంపద రూ.38,200 కోట్లు. రాజస్థాన్ లోని రాజ్ కోట్ లో ఏడుగురు.. పంజాబ్ లోని లూథియానాలో ఏడగురున్నారు.
– కేరళలోని త్రిస్సూర్ లో నలుగురు బిలియనీర్లు ఉన్నా.. వారి మొత్తం సంపద మాత్రం చాలా ఎక్కువ. ఈ నలుగురి సంపద ఏకంగా రూ.40వేల కోట్లు కావటం గమనార్హం. కోయంబత్తూరులో 14 మంది బిలియనీర్లు ఉన్నప్పటికీ వారి మొత్తం సంపద రూ.38,200కోట్లు.
– హరిద్వార్ లో ఒక్కరే బిలియనీర్ ఉండగా.. అతడి ఆస్తి రూ.32,400 కోట్లు.
– దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోని పట్టణాల్లోని బిలయనీర్ల సంపద కంటే.. కేరళలోని పట్టణాల్లో ఉన్న బిలియనీర్ల సంపద భారీగా ఉన్నట్లు తేల్చారు. ఎర్నాకుళంలో నలుగురు బిలియనీర్ల సంపద రూ.18,800 కోట్లు. కొట్టాయంలో ఒక్కరి వద్దే రూ.8,600 కోట్లు..తిరువనంతపురంలో ముగ్గురు వద్ద కలిపి రూ.10,800కోట్లు ఉన్నట్లుగా లెక్క తేల్చారు.