టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ కొట్టింది. గతానికి భిన్నంగా.. ఒలింపిక్స్ తొలి రోజు నుంచి కూడా క్రీడాకారు లు తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజతపతకం సాధించింది. 49 కిలోల వెయిట్ లిప్టింగ్ ఈవెంటులో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. భారతదేశం తరఫున ఒలింపిక్స్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి తర్వాత మీరాబాయి రెండవ వెయిట్ లిఫ్టర్.
మీరాబాయి 84, 87 కిలోల విభాగం వెయిట్ లిఫ్టింగులో విజయవంతం అయ్యారు. చైనాకు చెందిన హు జిహు 94 కిలోల బరువు ఎత్తి ఒలింపిక్ రికార్డు సృష్టించారు. ఐదేళ్ల క్రితం మీరాబాయి రియో ఒలింపిక్స్ లో పాల్గొని పేలవమైన ప్రదర్శన ఇచ్చినా, ఆ తర్వాత పుంజుకొని టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి భారత్ తరఫున బోణి కొట్టి రికార్డు సృష్టించారు. ఇదిలావుంటే, ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కూడా శుభారంభం చేసింది. పూల్-ఏలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 3-2 తేడాతో గెలిచింది.
భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా, రూపిందర్ పాల్ సింగ్ ఒక గోల్ చేశాడు. ఆట చివరి నిమిషాల్లో కివీస్ దూకుడు ప్రదర్శించింది. దీంతో ప్రత్యర్థి జట్టుకు వరుసగా పెనాల్టీ కార్నర్లు వచ్చాయి. అయితే, సీనియర్ గోల్‌కీపర్ శ్రీజిష్ వాటిని చక్కగా అడ్డుకున్నాడు. శ్రీజిష్ తన అద్భుత కీపింగ్ ప్రతిభతో ప్రత్యర్థి జట్టుకు గోల్స్ రాకుండా గోడల నిలబడి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఇక చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్ విజయంతో బోణీ కొట్టడం విశేషం. మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు తన తదుపరి మ్యాచ్ ఆదివారం ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఏదేమైనా.. టోక్యోలో మనోళ్లు బాగానే పుంజుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండడం గమనార్హం.