ఐసీసీ నిర్వహించే మెగా క్రికెట్ టోర్నీలలో పాకిస్తాన్ పై భారత్ తనకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఐసీసీ ఈవెంట్లలో దాయాది దేశం పాక్ పై ఉన్న రికార్డును టీమిండియా మరింత మెరుగుపరుచుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ విజయ భేరి మోగించింది. 6 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్ ను చిత్తు చేసి సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో పాక్ ఓటమిని శాసించాడు. ఈ ఓటమితో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాక్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. 51వ సెంచరీ సాధించిన కోహ్లీ ఈ మ్యాచ్ లో సచిన్ రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయి అందుకున్న క్రికెటర్ గా చరిత్ర పుటలకెక్కాడు. కోహ్లీ 287 ఇన్నింగ్స్‌లలో 14వేల పరుగులు చేయగా…సచిన్ 350 ఇన్నింగ్స్‌లు, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర 378 ఇన్నింగ్స్‌లలో ఆ ఘనత సాధించారు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యంత ఆదరణ ఉన్న ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ లో పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 49.4 ఓవర్లలో 241 పరుగులకు పాక్ ను ఆలౌట్ చేశారు. కెప్టెన్ రిజ్వాన్ (77 బంతుల్లో 46), షకీల్ (76 బంతుల్లో 62) తప్ప మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ పాండ్యా 2, హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ పటేల్ లు ఒక్కో వికెట్ పడగొట్టారు.
242 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ మొదలుబెట్టిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మంచి షాట్ లు కొడుతూ టచ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ 20 పరుగులకే ఔటయ్యాడు. గిల్, కోహ్లీలు ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును పరిగెత్తించారు. గిల్ (46) ఔటైన తర్వాత కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లు మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.
హాఫ్ సెంచరీ(56) చేసిన శ్రేయాస్ అయ్యర్ చివర్లో ఔటయ్యాడు. టీమిండియా విజయానికి 2 పరుగులు కావాల్సిన దశలో కోహ్లీ 96 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో, కోహ్ల సెంచరీ కొడతాడా లేదా అని తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఆ ఉత్కంఠకు తెరదించుతూ బౌండరీ కొట్టి సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ తో పాత కోహ్లీ తిరిగి వచ్చాడని, అద్భుతమైన షాట్లు కొట్టాడని కోహ్లీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.