నిశ్చలం అయిన సందర్భం
ఒక ఆగమన సంకేతిక
నిష్టురం అయిన సందర్భం
ఒక అవమానం కావొచ్చు
మనుషులంతా ఏమయిపోతున్నారో అన్న చిన్న సందేహం నుంచి వాళ్లలో ఉండాల్సినంత కనీస స్పృహ లేకుండా పోతుందే అన్న బాధ వరకూ పంద్రాగస్టు వేళల్లో ఏవేవో గుర్తుకువస్తుంటాయి.
దేశాన్ని కబళించే శక్తులు, కనికరం అంటూ లేని విధంగా ప్రవర్తించే శక్తులు ఇవాళ చాలా మన చుట్టూనే ఉన్నాయి.
కనుక మంచి సమాజ నిర్మాణానికి పంద్రాగస్టు పండగ ఏ విధం అయిన సాయం చేస్తుందో అన్న సంశయం ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఎందుకంటే అనేక అవలక్షణాలను పోగేసుకుని మనం
ఇవాళ దౌర్భాగ్యం అనుకునే స్థాయిలో ఉన్నా కూడా చాలా చెడును భరిస్తున్నాం.
చెడును సంస్కరించలేని వేళ కూడా మనం ఎవ్వరికీ చెందకుండా ఉన్నాం. కనుక పంద్రాగస్టు గొప్ప ఫలితాలు ఇవ్వక్కర్లేదు కానీ కనీస స్థాయి మార్పులకు, పౌరుల బాధ్యతలను పెంచేందుకు సహకరిస్తే చాలు.అప్పుడే ఆ వేళ ప్రవచించే జాతీయ నాయకుల స్ఫూర్తికో అర్థం. సూక్తులకో నీతులకో వాటి రాతలకో విలువ కూడా ! ఇవేవీ లేని రోజున పంద్రాగస్టులు చీకటినే శాశ్వతం చేసే ప్రమాదాలే ఎక్కువ. వెలుగును ఆహ్వానించడం అంటే మార్పును ఆహ్వానించడం కదా ! ఆ పాటి విజ్ఞత లేని మనుషులకు ఏం చెప్పగలం అని !
దేశాన్ని నడిపే శక్తులు కాస్త ఆలోచించి అడుగులు వేస్తే అడవులు అలానే ఉంటాయి. కొండా కోనలూ అలానే ఉంటాయి. ఇంకా కొన్ని అదే రీతిన మంచి మార్గానే ఉంటాయి. కానీ మనం వేటినీ బతకనివ్వకపోవడం ఓ పెద్ద తప్పులో భాగం.
వేటి ఉనికిని కాపాడకలేకపోవడం ఓ పెద్ద తప్పిదంలో భాగం. అయినా కూడా దేవుడు క్షమిస్తున్నాడు.
లేదా ప్రకృతి కూడా క్షమిస్తోంది. పంద్రాగస్టు పండుగల వేళ దేశాన్ని ప్రేమించడమే కాదు దేశ సంపదను సంరక్షిస్తూ ముందుకు పోవడం కూడా కీలకం అనుకునే బాధ్యత. ఆ విధంగామీరంతా ఈ దేశాన్నీ, ఈ మట్టినీ ప్రేమించండి. కనుక జీవితాల్లో గుడ్డితనం తొలగి మంచి రోజులు రావాలి. చీకటి తొలగించేందుకు చేసే కృషి ఒక్కటే కీలకం అయి ఉండాలి. అందుకే దేశం కొన్ని ఉత్కృష్ట రీతిలో ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి.
మన ఆనందాలు మన పతకాలు మన పరాభవాలు అన్నీ కూడా కొన్ని క్షణాల నుంచి కొన్ని రోజుల వరకూ ఉంటాయి.
కానీ సామాజిక బాధ్యత అంటూ లేని వారికి ఇవన్నీ అర్థం అవుతున్నాయా? అస్సలు సైన్స్ అండ్ టెక్నాలజీ లో వస్తున్న పురోగతి ఎవరికి ? ఏ దౌర్భాగ్యపు నీడల్లో ఈ సమాజాన్ని దాచుకునేందుకు అని ! మేలు చేసే పనులను కొన్నే చేసి వాటికే అతి ప్రచార కాంక్షను జోడించడం ఇప్పటి తప్పిదం. మేలు చేసే పనులు కొన్ని మన చుట్టూనే జరుగుతాయి.
వాటి నుంచి నేర్చుకోకుండా
ప్రయాణించడమే తప్పు. కనుక చేసే మంచితో కోరుకునే ప్రచారం, సంబంధిత కాంక్ష అన్నవి ప్రమాదకర శక్తులు. వాటిని వద్దనుకుని ఉండడమే ఇప్పటి ధర్మం.