వీకెండ్ లో తన పదునైన అక్షరాల్ని ఆర్టికల్ గా గుది గుచ్చి.. సంధించే ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే.. తాజాగా మరో సంచలన కాలమ్ ను రాశారు. అందులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని.. ఆయన సర్కారు తీరును నిశితంగా తప్పు పట్టారు.
ఈ సందర్భంగా పలు ఉదాహరణల్ని చూపించే ప్రయత్నం చేశారు. అన్నింటికి మించి తనదైన రీతిలో సంచలన సవాలును విసిరారు. తనపై ఆరోపణలు చేసే వారందరికి.. వారి ఆరోపణల్నిసాక్ష్యాలతో నిరూపిస్తే.. తన ఆంధ్రజ్యోతి దినపత్రికను వదులుకోవటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
చంద్రబాబునాయుడుఏపీ ముఖ్యమంత్రిగాఉన్న నసమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతికి రూ.700 కోట్ల మేర ప్రకటనలు ఇచ్చినట్లుగా గాలి ప్రచారం చేశారని.. అది నిజమైతే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి తనను ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.
అంతేకాదు..ఇప్పటికైనా సరే.. తాను తప్పు చేసినట్లుగా నిరూపిస్తే.. తన ఆంధ్రజ్యోతి పత్రికను వదులుకోవటానికి సిద్ధమన్న సవాల్‌ని ప్రత్యర్థులపై సంధించారు. ఇంతకూ ఆయనేమన్నారు. ఆయన సవాలు వెనుక ఉద్దేశం ఏమిటి? తాజాగా ఆయన ఏమని చెబుతున్నారు? అన్న విషయాల్ని ఆయన మాటల్లోనే చూస్తే..
– చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఇదే జగన్మోహన్ రెడ్డి పలుమార్లు ఆరోపించారు. అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ పత్రికకు అప్పనంగా రూ.700 కోట్లు దోచిపెట్టారని దుష్ప్రచారం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ‘ఆంధ్రజ్యోతి’కి అదనంగా ఒక్క రూపాయి ఇచ్చి ఉంటే జగన్ రెడ్డి ఇంతకాలం మౌనంగా ఉండేవారా?
– ఆనాడు రూ.700 కోట్లు అని గాలి ప్రచారం చేసినవాళ్లు అది నిజమని ఇప్పుడు నిరూపించినా ‘ఆంధ్రజ్యోతి’ పత్రికను వదులుకోవడానికి నేను సిద్థం. వైసీపీ నాయకులు గానీ, వారితో గొంతు కలిపినవారు గానీ ఈ సవాల్‌ను స్వీకరిస్తారా? ఇప్పుడు ముఖ్యమంత్రి సొంత పత్రిక, చానల్‌కు అనుచితంగా 200 కోట్ల రూపాయలకు పైగా ఈ 20 నెలల్లోనే దోచిపెట్టినందుకు ఏం సమాధానం చెబుతారు?
– ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాజీనామా చేస్తారా? సర్క్యులేషన్‌ను పరిగణనలోకి తీసుకుని ‘ఆంధ్రజ్యోతి’కి ప్రకటనలు ఇవ్వాల్సింది పోయి, అతి తక్కువ సర్క్యులేషన్‌తో నడుస్తున్న పత్రికలకు కోట్లాది రూపాయలు పంచిపెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారు?
తన ప్రభుత్వం న్యాయబద్ధంగా పనిచేస్తోందని జగన్‌రెడ్డి చెప్పగలరా? భారీ స్థాయిలో జరిగిన ఈ అధికార దుర్వినియోగానికి ఇవాళ కాకపోయినా రేపయినా న్యాయస్థానంలో సంజాయిషీ ఇవ్వక తప్పదు.