మనకన్నా పెద్ద వాళ్లు మనకు నమస్కరిస్తే కాస్తంత ఇబ్బంది పడతాం. భిక్షగాడైనా సరే.. వయసు మళ్లిన వ్యక్తి మన చేతితో ఇచ్చే ఐదు రూపాయిలకు కాళ్ల మీద పడబోతుంటే.. అయ్యో వద్దని వారిస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే.. గౌరవ మర్యాదలతో కాళ్లకు నమస్కరించే వైనాన్ని చాలామంది వద్దంటూ వారిస్తారు. అలాంటిది ప్రజల కోసం పని చేయాల్సిన ఐఏఎస్ అధికారులు.. అందుకు భిన్నంగా అధికార పార్టీ నేతల కాళ్లకు నమస్కారం చేయటం దేనికి నిదర్శనం?
రియల్ సీన్ ఇలా ఉంటే రీల్ సీన్లు మాత్రం.. ఐదేళ్లు అధికారంలో ఉండే మంత్రివి నువ్వు.. పాతికేళ్లకు పైనే సర్వీసు ఉండే నేను..నీ అడుగులకు మడుగులు ఒత్తాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించటం కనిపిస్తుంటుంది. ఒకప్పుడు ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు అంటే ఆ గౌరవం.. ఆ మర్యాద వేరుగా ఉండేది.
రూల్ బుక్ లోని నిబంధనల్ని తూచా తప్పకుండా ఫాలో కావటం.. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఉండటమే కాదు.. అవసరమైతే ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురై.. లూప్ లైన్ లో కూర్చోవటానికి.. అప్రాధాన్యత పోస్టుల్ని స్వీకరించటానికి సైతం వెనుకాడేవారు కాదు.
అందుకు భిన్నంగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులు ఒత్తే వారు తయారయ్యారు. అలాంటి వారు కెరీర్ పరంగా.. కీలక శాఖల్లో పోస్టింగులను దక్కించుకుంటున్నారు.పని తీరు కంటే కూడా విధేయతకు పెద్దపీట వేసే పాలకులకు తగ్గట్లు వ్యవహరించే అధికారులు ఎక్కువయ్యారన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యానారాయణకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన విజయనగరం జాయింట్ కలెక్టర్ సీహెచ్ కిశోర్ కుమార్ కాళ్లకు మొక్కిన ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
ఐఏఎస్ అధికారి అయిన కిశోర్ కుమార్ ట్రాక్ రికార్డును చూస్తే.. పెద్దగా వేలెత్తి చూపించే అంశాలు ఉండవు. అలాంటి అధికారులు సైతం మంత్రుల కాళ్లకు మొక్కేందుకు వంగిపోవటం.. వారు అలా వంగితే.. పదవి తెచ్చిన బింకంతో బొత్స లాంటి వారు స్పందిస్తున్న తీరు చూస్తే.. వీరేనా ప్రజల్ని ఉద్దరించే పాలకులు? అన్న భావన కలగటం ఖాయం. ఇలాంటి పాలకులు.. అధికారులు.. పేదోళ్లు.. సామాన్యుల గురించి ఆలోచించే అవకాశం ఉందంటారా?
https://www.youtube.com/watch?v=dHQXvKF7JQY&ab_channel=ABNTelugu