ఇరు రాష్ట్రాల్లోని సమకాలీన రాజకీయ నాయకుల్లో మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఉన్న ప్రత్యేకత వేరు. సుత్తి లేకుండా …ముక్కు సూటిగా …చెప్పదలుచుకున్న విషయాన్ని కన్విన్సింగ్ గా చెప్పగలిగిన నేర్పు ఉన్న నేత ఉండవల్లి. అంతటి వాగ్ధాటి…విషయ పరిజ్ఞానం ఉన్న ఉండవల్లిని సీఎం నుంచి సీనియర్ నాయకుల వరకు గౌరవిస్తారు.
తనకు చంద్రబాబు, జగన్ ఒక్కటేనని….ఏపీ సీఎంగా పాలనలోని లోపాలను ఎత్తిచూపడం తన నైజం అని అన్నారు ఉండవల్లి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడూ ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించానని…ఇపుడు జగన్ సీఎంగా ఉన్నా….అదే చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. అయితే, కొందరు టీడీపీ అభిమానులు మాత్రం…తాను జగన్ కు అనుకూలమనే భావనలో ఉన్నారని….వారి కోసం ఈ క్లారిటీ ఇస్తున్నానని అన్నారు. కానీ, జగన్ కు ఉండవల్లి రహస్య మిత్రుడని, పైకి విమర్శించినా..లోపల మాత్రం జగన్ అంటే అభిమానమని టీడీపీ నేతలు అంటుంటారు.
ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల మాటలను నిజం చేసేలా తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్నాళ్లపాటు జగన్ ప్రభుత్వం పై తాను విమర్శలు చేయబోనని ఉండవల్లి సంచలన ప్రకటన చేశారు. రామోజీరావు-మార్గదర్శి అంశంపై కోర్టు విచారణకు స్వయంగా హాజరై తానే వాదిస్తున్న ఉండవల్లి ఈ కామెంట్లు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్ ప్రభుత్వం పై కొంత కాలం పాటు విమర్శలు చేయనని, ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తే తనకు ఆ అర్హత లేదని చెబుతానని ఉండవల్లి అన్నారు.
ఏపీ పునర్విభజన వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడం తనకు బలాన్నిచ్చిందని చెప్పారు. అయితే, మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారం నేపథ్యంలో రామోజీరావుకు టిడిపి, కమ్యూనిస్టు పార్టీలు, జనసేన అనుకూలంగా ప్రకటనలు చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఇక, తనపై ఎవరు ఎంత దుష్ప్రచారం చేసినా సరే జరగాల్సింది జరిగి తీరుతుందని ఉండవల్లి అన్నారు.