కాకినాడ సెంటర్లో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా విరుచుకుపడటం తెలిసిందే. దీనిపై ద్వారంపూడి తాజాగా రియాక్టు అయ్యారు. తనపై పవన్ చేసిన ఘాటు విమర్శలపై అంతే తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తనపై చేసిన విమర్శలపై కౌంటర్ ఇస్తూ.. తన వద్ద రూ.15వేల కోట్లు ఉండి ఉంటే.. తాను పవన్ కల్యాణ్ ను కొనేస్తానని చెప్పారు. పవన్ ఒక రాజకీయ వ్యభిచారంటూ విరుచుకుపడిన ఆయన.. జనసేన పార్టీని ఎవరిని ఉద్దరించేందుకు పవన్ పెట్టారని ప్రశ్నించారు. పవన్ వెనుక పార్టీలో ఎవరూ లేరన్న ద్వారంపూడి.. రానున్న రోజుల్లో తానేమిటో చూపిస్తానన్నారు.
తను ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిస్తే.. పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారన్న ద్వారంపూడి.. ‘నన్ను విమర్శించే స్థాయి పవన్ కు లేదు. పొలిటికల్ గా పవన్ జీరో. ప్యాకేజీ చాల్లేదని వారాహి ఎక్కి తిరుగుతున్నాడు. సీఎంగా తాను చాలనని.. తన స్థాయి సరిపోదని మూడు నెలల క్రితం చంద్రబాబుకు మద్దతు పలికారు. కత్తిపూడిలో మాట మార్చాడు. సీట్లు కుదరక తనను సీఎం చేయాలని అడుగుతున్నాడు. కుమారస్వామిలా కాచుక్కున్నాడు. ప్యాకేజీ కుదరక రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు. మార్చి 14న ఒక మాట.. జూన్ 18న మరో మాట మాట్లాడావా?’’ అని ప్రశ్నించారు.
ఎవరో చెప్పిన మాటలు విని కోతిలా గంతులు వేయొద్దన్న ద్వారంపూడి.. బియ్యం వ్యాపారంతో తాను రూ.15వేల కోట్లు సంపాదించటం అబద్ధమన్నారు. ‘నా దగ్గరే అంత డబ్బు ఉంటే పవన్ ను కొనేస్తా. పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు పెరగటం ప్రభుత్వం చొరవ. నేను తల్చుకుంటే మీ బ్యానర్లను కట్టనివ్వను. నాది ‘డి బ్యాచ్’ అయితే.. పవన్ ది ‘ఏ బ్యాచ్’? పవన్ మాదిరి మాటల్లో చెప్పను. చేతల్లో చూపిస్తా. జన్మలో పవన్ నన్ను బేడీలు వేసి కొట్టలేడు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ సవాలును తాను స్వీకరిస్తున్నానని.. దమ్ముంటే పవన్ కాకినాడ నుంచి పోటీ చేయాలని సవాలు విసిరిన ద్వారంపూడి.. తనను ఓడించటం పవన్ వల్ల కాదని.. తానే ఆయన్ను ఓడిస్తానని వ్యాఖ్యానించారు. పవన్ చేసిన వ్యాఖ్యలకు సీరియస్ గా రియాక్టు అయిన ద్వారంపూడి మాటలకు పవన్ మళ్లీ స్పందిస్తారా? లేదా? అన్నది చూడాలి.