అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్-2 గ్రాండ్ గా మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నందమూరి నటసింహం బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయడం నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్ అన్నరీతిలో సాగింది. ఈ సందర్భంగా బావ చంద్రబాబును బామ్మర్ది బాలయ్య అడిగిన ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. ఎన్టీఆర్ ను మొదటిసారి ఎప్పుడు చూశారు అని చంద్రబాబును బాలయ్య అడగడంతో ప్రశ్నల పరంపర మొదలైంది.
తాను సినిమాటోగ్రఫీ శాఖా మంత్రిగా ఉన్న సమయంలో అనురాగదేవత షూటింగ్ సెట్లో ఎన్టీఆర్ ను చూశానని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు బాలయ్య ఉంటున్న జూబ్లీ హిల్స్ ఇంటి గురించి కూడా చంద్రబాబు వివరించారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం తెలుగువారిని అవమానించడం వంటిదని వ్యాఖ్యానించారు. తాను సీఎంగా ఉన్నపుడు ‘రాజశేఖర్ రెడ్డి’ పేరున ఉన్న జిల్లా, హార్టీ కల్చరల్ పేరు మార్చాలంటే ఒక్క నిమిషం పని అనీ, కానీ తాను గౌరవించానని, అది తన సంస్కారమని చంద్రబాబు అన్నారు. తానూ, రాజశేఖర్ రెడ్డి ఎంతో అన్యోన్యంగా కలసి తిరిగామని చెప్పారు.
బిగ్ డే, బిగ్ అలయన్స్, బిగ్ మిస్టేక్, బిగ్ ఫియర్, బిగ్ డెసిషన్, అన్న పదాలకు చంద్రబాబు తనదైన రీతిలో సమాధానమిచ్చారు. ‘బిగ్ డెసిషన్’గా 1995 వైశ్రాయ్ హోటల్ ఉదంతాన్ని చంద్రబాబు ప్రస్తావించడంతో ఒక్కసారిగా ఎపిసోడ్ సీరియస్ మోడ్ లోకి వెళ్లింది. తనకు ఎన్టీఆర్ ఒక ఆరాధ్య దైవమని చెప్పారు. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా? అంటూ చంద్రబాబు అడిగిన ప్రశ్నకు బాలయ్య తడుముకోకుండా ‘కాదు’అని జవాబిచ్చారు.
ఆ రోజు నేను కూడా మీతోపాటు నాన్నగారి దగ్గరకు వచ్చానని, హరికృష్ణ అన్నయ్య, బీవీ మోహన్ రెడ్డి కూడా తమతో ఉన్నారని బాలయ్య గుర్తు చేసుకున్నారు. అప్పటికే ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు ధోరణిలో ఉన్నారని, ఈ విషయం గురించి పెద్దాయనతో మాట్లాడదామని మనమంతా వెళ్లామని చంద్రబాబు అన్నారు. అయితే, రాజకీయాల గురించి మాట్లాడాలంటే చంద్రబాబు ఒక్కడే లోపల ఉండాలని ఎన్టీఆర్ అన్నారని, అప్పుడు బాలయ్య, హరికృష్ణ, మిగతావారంతా బయటకు వెళ్లారని చంద్రబాబు చెప్పారు.
మూడు గంటల పాటు ఆయనతో మాట్లాడానని, కాళ్లు కూడా పట్టుకుని బ్రతిమిలాడానని, అయినా ఆయన వినలేదని చెప్పారు. ఒక మీటింగ్ పెట్టండి, ఎమ్మెల్యేలందరినీ కన్సోల్ చేయండి, మీ మాట వారు వింటారు అని చెప్పినా ఎన్టీఆర్ వినలేదని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సిద్ధాంతాలను, పార్టీని కాపాడేందుకు ఆయనకు వ్యతిరేకంగా ముందుకు వెళ్లడం ఒక ఆప్షన్ అని, ఎన్టీఆర్ చెప్పినట్లు వినడం ఇంకో ఆప్షన్ అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
అయితే, పార్టీని కాపాడేందుకు అందరం కలిసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పారు. రామాంజనేయ యుద్ధం చరిత్ర అని, అదే మాదిరిగా తన పరిస్థితి ఆరోజు ఉందని అన్నారు. ఆ రోజు మీటింగ్ లో ఉన్న ఐదుగురిలో ఎన్టీఆర్, హరికృష్ణ, మోహన్ రెడ్డిలు లేరని, బాలయ్య, చంద్రబాబు మాత్రమే ఉన్నారని అన్నారు. ఆ రోజు మనం చేసింది తప్పా అని బాలయ్యను చంద్రబాబు అడిగారు. కాదు అని బాలయ్య జవాబిచ్చారు. వైశ్రాయ్ ఎపిసోడ్ పై చంద్రబాబు, బాలయ్య ఇచ్చిన క్లారిటీతో ఇన్నాళ్లూ చంద్రబాబుపై బురదజల్లిన వైసీపీ నేతలకు గట్టి సమాధానమిచ్చినట్లయింది. ప్రస్తుతం చంద్రబాబు ఎపిసోడ్ వైరల్ గా మారింది.