వైసీపీ మంత్రులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరిపాలన చేతకాని సీఎంతో మంత్రులకు ఫ్రస్టేషన్ వస్తోందని వ్యాఖ్యానించారు. తనకేం ఫ్రస్టేషన్ లేదని.. మంత్రులకే నిద్ర లేకుండా చేస్తానని హెచ్చరించారు.
పరిపాలన చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రితో మంత్రులకు ఫ్రస్టేషన్ వస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఏపీలో ఎక్కడా రూ.2వేల నోట్లు కనపడట్లేదని అవన్నీ తాడేపల్లి ప్యాలెస్లో దాచిపెట్టడం, ఢిల్లీ తరలించటం జరుగుతోందని ఆరోపించారు. అధికారుల్ని కోర్టు బోన్లలో నిలపెడుతున్న ప్రభుత్వానికి సిగ్గుందా అని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ ఎన్నిఅరాచకాలకు పాల్పడినా ఎదురొడ్డి పోరాడేందుకు నేతలు సిద్ధం కావాలని.. చంద్రబాబు పిలుపునిచ్చారు. డిసెంబర్ 1నుంచి 45 రోజుల పాటు “ఇదేం ఖర్మ” పేరుతో ప్రజల సమస్యలను,. లిఖితపూర్వకంగా నమోదు చేయనున్నట్లు ప్రకటించారు. టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. రాష్ట్రం కోసం ప్రాణాలైనా అర్పిస్తాగానీ వెనక్కి వెళ్లనని తేల్చిచెప్పారు.
వైసీపీ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగిస్తూనే డిసెంబర్ 1నుంచి “ఇదేం ఖర్మ”పేరిట మరో కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు.. “ఇదేం కర్మ” ప్రచార వీడియోను విడుదల చేశారు.
ఇంత దారుణమైన.. ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, అందుకే దీనికి” ఇదేం ఖర్మ” పేరు ఖరారు చేశామని చంద్రబాబు వివరించారు. మూడున్నరేళ్లలో.. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నో దారుణాలు జరిగాయని మండిపడ్డారు.
జాతీయ భావాలతో ముందుకెళ్తున్న పార్టీ టీడీపీ అని.. చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు అదే బాధ్యతగా ఉన్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో టీడీపీ ఒక నమూనా అని .. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం అని తేల్చిచెప్పారు.
మూడున్నరేళ్లుగా టీడీపీపై దాడులు చేస్తూనే ఉన్నారని.. రాత్రిళ్లు అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇంతటి దారుణ, నీచమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని తెలిపారు. మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.