తెలుగు చలనచిత్ర నిర్మాత దిల్ రాజు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీలతో సంబంధం లేకుండా ఈజీగా ఎంపీగా గెలుస్తాను అని వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఎంపీ అవుతానని అతి విశ్వాసం కనబరిచారు.
ఆయన మాటల్లోనే చెప్పాలంటే మీడియాతో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘ఏదైనా రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసినా ఎంపీగా గెలుస్తాను. కానీ తెలుగు సినిమా పరిశ్రమ నా మొదటి ప్రాధాన్యత. సీనియర్ నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో టీఎఫ్‌సీసీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. సినిమా పరిశ్రమ పట్ల బాధ్యతగా ఈ పదవిని తీసుకుంటున్నాను. నేను ఈ పదవి గెలిస్తే నాకు ఎలాంటి కిరీటం లభించదు. నిజానికి, నేను కొత్త సవాళ్లు, ఇబ్బందులను ఎదుర్కొంటాను. అయినప్పటికీ, తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి మరియు పురోగతి కోసం నేను ముందుకు వచ్చాను’’ అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.
ఈ పదవి కోసం నిర్మాత సి కళ్యాణ్‌తో గొడవల గురించి దిల్ రాజు స్పష్టం చేస్తూ, “ఆయనతో ఎలాంటి వివాదాలు మరియు విభేదాలు లేవు. తెలుగు ఫిలిం ఛాంబర్ బలోపేతం కోసం ముందుకు వచ్చాం. ఫిల్మ్ ఛాంబర్ అనేది నిర్మాతలు, స్టూడియో యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లు అనే నాలుగు రంగాలకు అత్యున్నత సంస్థ. ఈరోజు అత్యంత విజయవంతమైన మరియు టాప్ ఫామ్‌లో ఉన్న నిర్మాతలందరూ నా ప్యానెల్లో ఉన్నారు. దిల్ రాజు ప్యానెల్ అత్యంత యాక్టివ్ ప్యానెల్. ఈ ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో గెలుస్తామని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు.
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. గుర్తింపును మరింత బలోపేతం చేసి ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాలి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో 1560 మంది నిర్మాతలు సభ్యులుగా ఉన్నారు. అందులో 200 మంది మాత్రమే క్రియాశీల నిర్మాతలు. సినిమా పరిశ్రమ పురోభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని దిల్ రాజు అన్నారు.
అంతా ఓకే గానీ… ప్రజలు ఓట్లేస్తే గెలుస్తాను అని చెప్పాల్సిన దిల్ రాజు ఏ పార్టీ నుంచి అయినా ఎంపీగా గెలుస్తానని వ్యాఖ్యానించడం ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు, డబ్బుతో ఏ పనయినా అయిపోతుందన్న నమ్మకం కూడా ఆయనలో బలంగా ఉండి ఉండవచ్చు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఎన్నికలు 30 జూలై 2023న జరగనున్నాయి. రేపు రోజు చివరిలో ఫలితాలు ప్రకటించబడతాయి. అందరి దృష్టి రేపటి ఎన్నికలపైనే ఉంది.