జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అదే రీతిలో వైసీపీ నేతలను పవన్ కూడా ఏకిపారేస్తున్నారు. ఈ రకంగా ఈ రెండు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాను పవన్ ఫ్యాన్ అంటున్నారో వైసీపీ మంత్రి. పవన్ అంటే తనకూ అభిమానమేనని ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. అయితే, ఆ అభిమానం సామాజికవర్గంపరంగా వచ్చిందేనని కొట్టు చెబుతున్నారు. కానీ, కాపులంతా బాధపడేలా పవన్ వ్యవహరిస్తున్నారని కొట్టు చెబుతున్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కావాలనుకునేవారంతా…పవన్ వెంట వెళ్లి కేరింతలు కొడుతున్నారని కొట్టు చెప్పారు. కానీ, కాపులను సీఎంగా చూడాలన్న ఆలోచన తనకెందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ ల మధ్య ఉన్నది అపవిత్ర పొత్తు అని కొట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ బీజేపీని పెళ్లి చేసుకుని టీడీపీతో కాపురం చేస్తానని అంటున్నారని కొట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ పని చేసి కాపుల పరువు తీయొద్దని పవన్ కు చెబుతున్నామని అన్నారు. పవన్ వ్యవహారశైలిపైనా కొట్టు విమర్శలు గుప్పించారు. ‘ఆయన్ను ఎవరికైనా చూపించడ్రా’ అంటూ జనం సినిమా డైలాగులు చెబుతున్నారని పవన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ మళ్లీ సీఎం కాకుండా అడ్డుకోవడం చంద్రబాబు, పవన్ వల్ల కాదని జోస్యం చెప్పారు. తెలంగాణలో ఉన్న వ్యాపారాలు, ఇబ్బందుల వల్లే తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్లో చేరి ఉంటారని అన్నారు. దేవినేని అవినాశ్ వైసీపీలో ఎందుకున్నారో? వంగవీటి రాధా టీడీపీలో ఎందుకున్నారో విజయవాడ ప్రజల్ని అడిగితే చెబుతారని అన్నారు.