మారిన కాలానికి తగ్గట్లుగా కొత్త సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. నచ్చినోళ్లను వెతుక్కునేందుకు వీలుగా.. ఎవరి అవసరాలు వారివి అన్న కాన్సెప్టుతో వచ్చిన డేటింగ్ యాప్ లు దేశంలో ఎక్కువ అవుతున్నాయి. మాయదారి కరోనా కారణంగా నెలల తరబడి ఇంట్లోనే ఉండాల్సి రావటం.. అదే సమయంలో చేతిలో ఉన్న మొబైల్ తో సరికొత్త స్నేహాలకు అసరాను ఇచ్చాయి డేటింగ్ యాప్ లు. దేశంలో వీటి వినయోగం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
తాజాగా ఒక ప్రముఖ ఆన్ లైన్ డేటింగ్ సంస్థ నిర్వహించిన ఇయన్ ఇన్ స్వైప్ 2021 సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. దేశంలో అత్యధికంగా డేటింగ్ యాప్ లను వినియోగించే మహానగరంగా హైదరాబాద్ నిలిచింది. తర్వాతి స్థానాల్లో చెన్నై.. బెంగళూరు.. అహ్మదాబాద్.. పూణె నగరాలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు 30 వరకు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసున్న వారి నుంచి సమాచారాన్ని సేకరించారు.
ఈ సందర్భంగా డేటింగ్ యాప్ ల వినియోగంలో హైదరాబాదీలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందే. డేటింగ్ యాప్ లతో తమ అవసరాలకు తగ్గట్లుగా భాగస్వామి దొరుకుతారన్న దాన్లో ఎలాంటి నిజం లేదని.. అందులో వాస్తవం కంటే ఫేక్ ఎక్కువగా ఉన్నట్లుగా చెబుతున్నారు. డేటింగ్ యాప్ ల ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న మోసాల్లో 33 శాతం క్యాట్ ఫిషింగ్.. 38 శాతం హానికరమైన లింకులు లేదంటే అటాచ్ మెంట్ల.. 36 శాతం మంది ఫోన్లలో డేటా చోరీ జరిగినట్లుగా కాస్పర్ స్కీ గ్లోబర్ సర్వే వెల్లడైంది.
డేటింగ్ యాప్ ల వినియోగంతో పాటు.. పిక్ నిక్ ఇన్ ఎ పార్క్.. వర్చువల్ మూవీ నైట్.. సైక్లింగ్.. పొట్టెరీ అంశాలపై కూడా ఎక్కువ మంది ఆసక్తిని చూపించినట్లుగా గుర్తించారు. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ డేటింగ్ యాప్ ల వినియోగం పెరిగిందని.. చాలామంది యువతీ యువకులు డేటింగ్ యాప్ ల మాయలో పడ్డారని చెబుతున్నారు.
డేటింగ్ యాప్ లతో వచ్చిన చిక్కేమిటంటే.. ఇందులో చాలా ప్రొఫైల్స్ ఫేక్ గా ఉండటం.. అలాంటి వాటిని గుర్తించటంలో డేటింగ్ యాప్ లు ఫెయిల్ అవుతున్నాయి. చాలా యాప్ సంస్థలు బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ సరిగా చేయటం లేదన్న ఆరోపణ ఉంది. దీంతో.. మోసాల బారిన పడుతున్నట్లు చెబుతున్నారు. డేటింగ్ యాప్ లను అప్రమత్తతతో వినియోగించాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.