ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి, హీరోయిన్ నిధి అగర్వాల్ చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సంచలనంగా మారుతోంది. సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మాట విని ఎందరో అమాయకులు బెట్టింగ్ యాప్స్ వలలో పడి దారుణంగా మోసపోతున్నారు. కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు కఠన చర్యలు తీసుకుంటున్నారు.
ఈడీ కూడా ఎంటర్ అవ్వడంతో ఇష్యూ మరింత ముదురుతోంది. తాజాగా బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించిన వ్యవహారంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో పలువురు సినీ నటులపై కేసులు నమోదు అయ్యాయి. టాలీవుడ్‌కు చెందిన నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండతో సహా 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఇటీవల ఐపీఎస్ అధికారి, ప్రస్తుత ఆర్టీసీ ఎండి సజ్జనర్ ఈ విషయంపై సీరియస్ గా రియాక్ట్ కావడంతో.. పోలీసులు మరింత వేగం పెంచారు. బెట్టింగ్ యాప్స్ ను గతంలో ప్రమోట్ చేసిన వారు మరియు ప్రస్తుతం చేస్తున్న వారిపై వరుస కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్న 11 మంది సెలబ్రిటీలకు తెలంగాణ పోలీసులు నోటీసులు పంపారు. ఈ జాబితాలో విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్ష సాయి, పరేషాన్ బాయ్స్, టేస్టీ తేజ, ఇమ్రాన్, అజయ్, కిరణ్ గౌడ్, సుధీర్ రాజు, సన్నీ యాదవ్, శ్యామల వంటి వారు ఉన్నారు. వీరిలో యాంకర్ విష్ణుప్రియ నేడు విచారణకు హాజరైంది