వాషింగ్టన్ డిసిలో తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షతన నిర్మాణంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో మేడసాని మోహన్ దసరా ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేడసాని మాట్లాడుతూ మహాభారతంలోని అనేక సంఘటనలు ప్రస్తుత సమాజానికి వర్తిస్తాయి.
కృష్ణుడు, ధర్మరాజు, భీష్ముడు తదితర పాత్రల ద్వారా అనేక అంశాలు మనకి భోదపడతాయన్నారు.
దుర్యోధనుడు, శకుని, కీచకుడు లాంటి పాత్రలు నేటిసమాజంలో కూడా కనిపిస్తున్నాయన్నారు.
మాయా జూదం, ఎత్తులు పై ఎత్తులు, పగ ప్రతీకారం, అహం లాంటివాటితో అధికారం, సంపద కోల్పోయారు.
ఆధ్యాత్మికత అంటే మతం కాదు.
అదో గొప్ప నాగరికత అది సంఘ జీవన హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం.
భారత దేశ సంస్కృతి, నాగరికత అతి ప్రాచీనమైనవని ఆయన అన్నారు.
మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ అష్టావధానంలోని మాధుర్యాన్ని మేడసాని ప్రపంచానికి చాటి చెప్పారు.
తెలుగులో అష్టావధాన కళను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.
అవధాన ప్రక్రియతో సాహితిక్రతు నిర్వహించారు.
అక్షర సేద్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేసారు. అక్షరాన్ని ఆయుధంగా మలచి సాహితీ జగత్తును శాసించారు.
సతీష్ వేమన మాట్లాడుతూ మేడసాని చేసిన ప్రసంగం పసివారు సైతం శ్రద్దగా విన్నారు.
ఎక్కడా విసుగు, విరామం లేకుండా కొన్ని గంటలపాటు ఆయన ప్రసంగించగలరు.
అష్టావధానంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన సాంగత్యంలో ఈ పవిత్రమైన ప్రదేశంలో మేము పాల్గొనటం మాకు చాలా సంతోషంగా ఉంది.
ప్రతీ పద్యానికి తాత్పర్యం చెప్పటం ద్వారా ప్రేక్షకులు రసజ్ఞతతో ఆస్వాదించారు.
దేవస్థానం వ్యవస్థాపకులు రావిపాటి జనార్దన్ మాట్లాడుతూ
ఆల్డీ లో నిర్మాణంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నిర్మాణానికి సుమారు 120 కోట్లకు పైగా ఖర్చవుతుందని తెలిపారు.
ఈ ప్రాంతంలో ఉన్న అనేకమంది దీని నిర్మాణానికి సహకరిస్తున్నారన్నారు.
దేవస్థానం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం మరింత సుందరంగా తయారవుతుందన్నారు.
హిందువులు ఎక్కువగా నివస్తున్న ఈ ప్రాంతంలో దేవస్థానం నిర్మాణం ద్వారా భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో భాను మాగులూరి, ధూళిపాళ్ళ వీరానారాయణ, రమేష్ అవిరినేని, సీతారమారావు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం రావిపాటి జనార్దన్ దంపతులు, సతీష్ వేమన, మన్నవ సుబ్బారావు మేడసాని మోహన్ ను ఘనంగా సత్కరించారు.