ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో రాజధాని మహిళలు, రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహా పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. ఈ మహా పాదయాత్ర ఆరో రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. దీపావళి పండుగను సైతం కుటుంబ సభ్యులతో జరుపుకోకుండా…రైతులు, మహిళలు రాజధాని అమరావతి కోసం మండుటెండలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరో రోజు శనివారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్రకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
ఈ పాదయాత్రకు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు మద్దతు తెలిపారు. ఇంజనీరింగ్ పట్టభద్రులు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ నేతలు పాల్గొన్నారు. రైతుల పాదయాత్రను కించపరుస్తు మంత్రులు మాట్లాడడం తగదని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందనడానికి పాదయాత్రకు లభిస్తున్న ఆదరణే నిదర్శనమని టీడీపీ సీనియర్ నేత ధూళ్లిపాళ్ల నరేంద్ర తెలిపారు.
సంగం డెయిరీ సిబ్బంది రైతులకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్‌బాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని మా హక్కు అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు. బ్రిడ్జిపై జనసంద్రంగా మారిన రైతులు, మహిళలు…తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
కాగా, ఈ మహాపాదయాత్రకు పలువురు టీడీప నేతలు, కార్యకర్తలు, స్థానికులు ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆహారాన్ని, శీతల పానీయాలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రకు సంఘీభావంగా గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వరగాని గ్రామ ప్రజలు రూ.లక్షా 44 వేలు ఇచ్చారు. వేమూరు నియోజకవర్గం ప్రజలు రూ.26 వేల నగదు, 26 అరటి గెలలు అందించారు.