ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత, అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఎంపీ రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోన్న సంగతి తెలిసిందే. గతంలో రకరకాల కారణాలతో రాహుల్ గాంధీతో విభేదించిన వారంతా కూడా తాజాగా రాహుల్ పై సస్పెన్షన్ వేటుతో ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. ముఖ్యంగా, తనపై అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
తనపై పడిన సస్పెన్షన్ వేటు చూసి భయపడబోనని చెప్పిన రాహుల్ గాంధీ…తన పేరులో గాంధీ ఉందని…సావర్కర్ లేదని చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో, సోషల్ మీడియాలో కాంగ్రెస్ తో పాటు రాహుల్ కు మద్దతిస్తున్నవారంతా ఆ ప్రెస్ మీట్ చూసి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.ఢిల్లీలో ఈ రకంగా పాత్రికేయులతో కిక్కిరిసిన ప్రెస్ మీట్ చూసి చాలాకాలం అయ్యిందని కామెంట్లు చేస్తున్నారు.
రాహుల్ ను ప్రశ్నలతో ఇరుకున పెట్టాలని మోడీ అనుకూల మీడియా ప్రతినిధులు కూడా అక్కడకు వేటగాళ్లలాగా వచ్చారని, తనను వేటాడే ప్రశ్నలను కూడా దీటుగా ఎదుర్కొన్న రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ ఒక్కరేనని ప్రశంసిస్తున్నారు. ఇక, తనను ఇబ్బంది పెట్టేందుకు వచ్చిన ఓ జర్నలిస్టుకు రాహుల్ గాంధీ చురకలంటించిన వైనం కూడా వైరల్ గా మారింది. తీరు మార్చుకోమనీ, సరైన జర్నలిస్టుగా ఉండాలని…బీజేపీ అనుకూలిడిగా ఉండొద్దని హితవు పలికారు.
“జర్నలిస్టులా నటించవద్దు. మీరు మంచి ప్రశ్నలు ఎందుకు అడగరు? మీరు బీజేపీ కోసం పనిచేస్తున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మీరు నన్ను ఎందుకు సరైన ప్రశ్నలు అడగట్లేదు?” అని రాహుల్ ప్రశ్నించారు. “గాలి పోయిందా (Kyun hawa nikal gayi?)” అని రాహుల్.. చిన్నగా నవ్వారు. ఇక, ప్రెస్ మీట్ లకు, మీడియా అడిగే ప్రశ్నలకు దూరంగా ఉండే మోడీతో రాహుల్ ను పోలుస్తూ కాంగ్రెస్ మద్దతుదారులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.