ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు మరోసారి ఊరట లభించింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఆ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగాల్సి ఉండగా..ఇరు వర్గాల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీం కోర్టు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
దర్యాప్తు అధికారులను చంద్రబాబు కుటుంబం బెదిరిస్తోందని సీఐడీ తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. అందుకే, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని, అందుకు సంబంధించి ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ కూడా దాఖలు చేశామని కోర్టుకు రోహత్గీ తెలిపారు. ఒక డైరీలో అధికారుల పేర్లు రాసుకుంటున్నామని, తాము అధికారంలోకి రాగానే వారిపై చర్యలు తీసుకుంటాంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రోహత్గీ ఆరోపించారు.
ప్రభుత్వం, సీఐడీ పాయింట్ ఔట్ చేసిన ప్రతి అంశానికి సమాధానమిస్తామని చంద్రబాబు తరఫు లాయర్ హరీష్ సాల్వే చెప్పారు. ఈ క్రమంలోనే రెండు వారాల లోపు కౌంటర్ దాఖలు చేయాలని, మూడు వారాల తర్వాత తదుపరి విచారణ ఉంటుందని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. దీంతో, సీట్ల పంచాయతీలో ఉన్న చంద్రబాబుకు సుప్రీం బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లయింది.