ఏఫీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కంట్లో నలుసులా, పక్కలో బల్లెంలా మారిన సంగతి తెలిసిందే. స్వపక్షంలో విపక్షంలా మారిన రఘురామపై చర్యలు తీసుకోలేక…పార్టీ నుంచి తీసేయలేక…అనర్హత వేటు వేయించలేక జగన్ సతమతమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, తనపై అనర్హత వేటు వేయించాలని రఘురామ ఛాలెంజ్ చేసినా…జగన్ అండ్ కో దానిని స్వీకరించలేదు.
ఇలా, రఘురామను నేరుగా ఎదుర్కొనలేని వైసీపీ నేతలు..ఆయన వ్యాపారాలను టార్గెట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే రఘురామకు చెందిన ఇందు భారత్ థర్మల్ కంపెనీపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారని ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే కొద్ది నెలల క్రితం రఘురామకు చెందిన ఇందు థర్మల్ కంపెనీ దివాళా తీసిందంటూ గతంలో ప్రకటన వెలువడింది. దీనిపై, రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. దివాళాకంపెనీగా ప్రకటించడానికి అనుసరించాల్సిన పద్ధతులను అనుసరించలేదని కోర్టుకు రఘురామ వివరించారు.
ఈ నేపథ్యంలో రఘురామపై సీబీఐ కేసు విచారణపై ఆనాటి హైకోర్టు సీజే హిమా కోహ్లీ ధర్మాసనం స్టే విధించింది. అయితే, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ సీజే అయిన తర్వాత ఆ స్టేను తొలగించారు. ఈ క్రమంలోనే స్టే కోరుతూ రఘురాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో, తాజాగా రఘురామ పిటిషన్ ను జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్ లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ జరిపింది. తాము తుది తీర్పును వెలువరించేంత వరకు కేసు విచారణను ఆపివేయాలని సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో, రఘురామకు సుప్రీం కోర్టులో ఊరట లభించినట్లయింది.