సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం, ఆ తర్వాత ఆయన రెగ్యులర్ బెయిల్ పై విడుదల కావడం తెలిసిందే. రూ.50 వేల పూచీకత్తుతో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాలని కోర్టు షరతు విధించింది. దాంతోపాటు, విదేశాలకు అల్లు అర్జున్ వెళ్లకూడదని కోర్టు షరతు విధించింది.
అయితే, తాజాగా తనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వాలని, భద్రతా కారణాల రీత్యా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరు కావడం నుంచి మినహాయింపునివ్వాలని అల్లు అర్జున్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు అల్లు అర్జున్ కు భారీ ఊరటనిచ్చింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు ప్రతి ఆదివారం హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. అంతేకాదు, విదేశాలకు వెళ్లేందుకు అల్లు అర్జున్ కు అనుమతినిచ్చింది. నాంపల్లి కోర్టు తాజా తీర్పుతో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించినట్లయింది.