పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలు నటిస్తోన్న మల్టీస్టారర్ మూవీ “భీమ్లా నాయక్”పై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఇప్పటికే విడుదలైన పవన్ ఫస్ట్ గ్లింప్స్, భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, డ్యూయట్ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు, స్క్రీన్ ప్లే అందిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ నేపథ్యంలోనే మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పయున్ కోషియుం చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతుందని పవన్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్థాయిలో థియాట్రికల్ రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
అయితే, తాజాగా ఈ చిత్రానికి ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమ్ చేసేందుకుగాను అమెజాన్ సంస్థ రూ.150 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, థియేటర్లలో రిలీజ్ చేయాలని భావిస్తున్న మేకర్స్ ఈ ఆఫర్ కి ఒప్పుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. ఆల్రెడీ ఈ చిత్ర మలయాళ వెర్షన్ చాలామంది చూసిన నేపథ్యంలో ఓటీటీకే నిర్మాతలు మొగ్గుచూపుతారా అన్న చర్చ జరుగుతోంది.