దసరాకు విశాఖపట్నానికి మారుతున్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేయటం తెలిసిందే. మరి.. విశాఖలో ఆయన ఎక్కడ నివాసం ఉండనున్నారు. ఆ ఇంటి కోసం చేస్తున్న కసరత్తు ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి
జగన్ నివాసం కోసం రుషికొండను ఎంపిక చేయటం.. అక్కడ నిర్మిస్తున్న నిర్మాణాలపై సంచలన ఆరోపణలు తెర మీదకు వస్తున్నాయి.
రుషికొండ మీద నిర్మించిన వేంగి.. కళింగ.. గజపతి.. విజయనగర పేర్లతో నిర్మించిన నాలుగు బ్లాక్ ల్లో.. విజయనగర బ్లాక్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం ఉంటారని చెబుతున్నారు. అయితే.. నివాస పనుల కోసం పెట్టిన ఖర్చుపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రుషికొండపై నిర్మించిన నాలుగు బ్లాకుల నిర్మాణం కోసం ఇప్పటివరకు రూ.434.5 కోట్లు ఖర్చు చేశారని.. ప్రహరీతో పాటు ఇంకా మిగిలిన ఇతర పనులు చేసేందుకు రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు ఖర్చు అవుతాయని చెబుతున్నారు. మొత్తంగా రూ.500 కోట్ల వరకు ఖర్చు అయ్యే వీలుందంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. అంతేకాదు.. రుషి కొండ మీద పర్యాటక శాఖకు చెందిన రిసార్టును కూలగొట్టి మరీ.. దాని స్థానంలో విలాసవంతమైన భవనాల్ని నిర్మించాల్సిన అవసరాన్ని ప్రశ్నిస్తున్నారు. రుషికొండ సముద్ర అందాల్ని సామాన్య ప్రజానీకం తిలకించేందుకు వీలుగా ఉన్న రిసార్టును కూలగొట్టేసి.. దాని స్థానంలో నాలుగు బ్లాకులను నిర్మించే కన్నా.. వేరే చోట నిర్మించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రుషికొండ మీద పర్యాటక శాఖ రిసార్టు మద ఏటా రూ.7.5 కోట్ల ఆదాయం వచ్చే నిర్మాణాల్ని కూల్చేసి.. వాటి స్థానంలో కొత్త నిర్మాణాల్ని నిర్మించాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్న ప్రధానంగా మారింది. పర్యాటక శాఖకు ఉన్న రెండు బ్లాకుల విలువ రూ.10కోట్లు చేస్తుందని.. అలాంటిది.. వాటిని కూల్చేసి.. స్థలాన్ని చదును చేయటానికే రూ.56 కోట్లు ఖర్చు చేసినట్లుగా వస్తున్న సమాచారం ఇప్పుడు షాకిచ్చేలా మారింది.
రూ.10 కోట్ల విలువైన భవనాల్ని కూల్చేందుకు రూ.56 కోట్లు ఎలా ఖర్చు అవుతాయన్నది సామాన్యుల ప్రశ్న. దీనిపై వస్తున్న వార్తలు.. సమాచారంలో తప్పుంటే.. ప్రభుత్వ వెర్షన్ ను అధికారికంగా విడుదల చేస్తే బాగుండేది. కానీ.. అలాంటిదేమీ జరగకపోవటంతో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రుషికొండపై నిర్మిస్తున్న వేంగి.. కళింగ.. గజపతి.. విజయనగర పేర్లతో నిర్మిస్తున్న నాలుగు బ్లాక్ లన్ని కూడా జీప్లస్ వన్ నిర్మాణాలు.
వీటిల్లో కళింగ బ్లాకులోని గ్రౌండ్ ఫ్లోర్ ను ముఖ్యమంత్రి కార్యాలయంగా వినియోగించేందుకు సిద్ధం చేశారు. విజయనగరలో ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉండనుంది. మొత్తం పనులను నాలుగు దశల్లో చేపట్టారు. వీటి విస్తీర్ణం 1.5 లక్షల చదరపు అడుగులకు పైనే ఉంటుందని చెబుతున్నారు. రుషికొండపై నాలుగు బ్లాకుల నిర్మాణం కోసం ఇప్పటివరకు రూ.434.5 కోట్లు ఖర్చు చేయగా.. చుట్టూ నిర్మించాల్సిన ప్రహరీతో పాటు ఇతర పనుల్ని పూర్తి చేయటానికి మరో రూ.50 కోట్లు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అంటే.. విశాఖలో సీఎం అధికారిక నివాసం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేయటమా? అన్నదిప్పుడు హాట్ చర్చగా మారింది. మరి.. ఈ విమర్శలపై ప్రభుత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.