టీడీపీ నేతలు, టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు నిరసనగా ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు దీక్షా స్థలి వద్దకు భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఈ రోజు రాత్రి 8గంటలకు దీక్ష ముగియనుండడంతో చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ శ్రేణులు వేల సంఖ్యలో దీక్షా స్థలికి చేరుకుంటున్నాయి.
మరోవైపు, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చంద్రబాబు చేపట్టిన దీక్షకు సీపీఐ నేత నారాయణ సంఘీభావం తెలిపారు. చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసిన నారాయణ…దీక్షకు సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లాలో అన్న ఏడూరి కారణంగా నేరుగా దీక్షా స్థలికి రాలేకపోయానని చంద్రబాబుకి నారాయణ తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజావ్యతిరేక విధానాలవలంబిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి పని చేద్దామని నారాయణ సూచించారు.
మరోవైపు, గురువారం అర్థరాత్రి వరకూ ఎన్టీఆర్ భవన్కు టీడీపీ కార్యకర్తలు క్యూ కట్టారు. తమ పార్టీ అధినేత దీక్షకు సంఘీభావంగా తెలుగుతమ్ముళ్లు వేల సంఖ్యలో దీక్షా స్థలికి తరలివచ్చారు. గురువారం రాత్రి 10:30 తర్వాత దీక్షా స్థలిపైనే చంద్రబాబు నిద్రించారు. ఉదయం 5 గంటలకు నిద్రలేచిన చంద్రబాబు శుక్రవారంనాడు చివరి రోజు దీక్షను కొనసాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. చంద్రబాబుకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆయన ఆరోగ్య స్థితిని తెలుసుకోనున్నారు. మరోవైపు, శనివారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను చంద్రబాబు ఢిల్లీలో కలిసి ఈ దాడుల పరిణామాలను వివరించబోతున్నారు.