టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకటి. తెలుగు సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ తోనే రకుల్ ఇతర భాషల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు తెగ కష్టపడుతోంది. అయితే టాలీవుడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి టాప్ స్టార్స్ అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న రకుల్.. ఒక్క ప్రభాస్ తో మాత్రం సినిమా చేయలేకపోయింది.
కానీ గతంలో మాత్రం ప్రభాస్, రకుల్ కాంబోలో ఒక సూపర్ హిట్ మూవీ మిస్ అయిందట. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టారు. ఇంతకీ ప్రభాస్ తో రకుల్ మిస్ చేసుకున్న సినిమా మరేదో కాదు `మిస్టర్ పర్ఫెక్ట్`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాకు దశరధ్ దర్శకుడిగా వ్యవహరించారు. మెయిన్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్.. సెకండ్ హీరోయిన్ గా తాప్సీ నటించారు. 2011లో విడుదలైన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం సానుకూల స్పందనతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజికల్ గా కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను దిల్ రాజు రివీల్ చేశారు. మలేషియాలో బిల్లా షూటింగ్ లో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఆ టైమ్ లో దిల్ రాజు, దశరధ్ వెళ్లి కథ చెప్పారు. సెకండ్ హాఫ్ అంతగా నచ్చకపోవడంతో ప్రభాస్ నో చెప్పాలని అనుకున్నాడు. దాంతో దశరథ్ పలు మార్పులు చేసి మళ్లీ స్టోరీని నరేట్ చేయగా.. ఈసారి ప్రభాస్ కు బాగా నచ్చింది.
హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేశారు. హైదరాబాద్ లో షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఐదు రోజుల తర్వాత రష్ చూసి ఎవ్వరూ సంతృప్తి చెందలేకపోయారు. సినిమా స్టోరీ మొత్తం హీరోయిన్ మీదే డిపెండ్ అయి ఉంది. ఎమోషన్స్ బాగా పండివ్వాలి. కానీ రకుల్ ఆ విషయంలో విఫలం అయింది. పైగా సన్నగా ఉండటం వల్ల క్యారెక్టర్ కు రకుల్ అస్సలు సెట్ అవ్వలేదని దర్శకనిర్మాతలు భావించారు. ఈ క్రమంలోనే ఐదు రోజులు షూటింగ్ జరిగిన తర్వాత రకుల్ ను తప్పించారు. ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇక ప్రభాస్, కాజల్ జోడి ప్రేక్షకులను ఎంతలా అలరించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.