సీఎం చంద్రబాబుపై పీకల దాకా కోపం ఉంది. దీనిని సహించొచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటే.. నషాళాన్ని అంటే మంటా ఉంది.. దీనిని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ, ఏ చిన్న కష్టం వచ్చినా.. పరిగెట్టుకుంటూ.. తలుపు తడుతున్న గవర్నర్ అంటే.. జగన్ కు ఎందుకు కోపమో.. అర్ధం కావడం లేదు. తాము ఇస్తున్న ఫిర్యాదులను ఆయన బుట్టదాఖలు చేస్తున్నారన్న అక్కసా? లేక.. గవర్నర్ తమను పట్టించుకోవడం లేదన్న ఆవేదనా? అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే.. గవర్నర్ ఆహ్వానించినా.. జగన్ దూరంగా ఉండిపోయారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని రాజ్‌భవన్‌లో `ఎట్ హోం` నిర్వహించడం ఆనవాయితీ. ఇది అధికారిక కార్యక్రమం. దీనికి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, క్రీడాకారులు ఇలా అన్ని వర్గాలను రాజ్‌భవన్ ఆహ్వానించింది. వీరంతా కూడా వచ్చారు. కానీ, ఇదేసమయంలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం జగన్‌కు ఆహ్వానం పంపించినా .. ఆయన కానీ వైసీపీనాయకులు కానీ.. ఎమ్మెల్యేలు కానీ ఎవరూ రాకపోవడం గమనార్హం. ఒక్క శాసన మండలి చైర్మన్ మాత్రం హాజరయ్యారు.
మరి ఇలా గవర్నర్ అంటే కూడా గౌరవం లేకపోతే.. ఎలా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. రాజకీయంగా విభేదాలు ఉంటే.. అవి ప్రభుత్వంతోనూ.. పార్టీలతోనూ చూసుకోవాలి. తప్ప గవర్నర్‌తో కాదు కదా! కానీ. ఈ విషయంలోనూ జగన్ రాజకీయాలు చూసుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ వస్తారు కాబట్టి.. వారి పక్కన కూర్చోవడం తనకు ఇష్టం లేదన్నట్టుగా ఆయన వ్యవహరించారు. అంతేకాదు.. ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా పంపించకుండా.. కట్టు దిట్టం చేయడం గమనార్హం. మరి దీనిని వైసీపీ ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.