ఓ ఇంట్లో ఆడమనిషి ఉంది.. ఏదో పని చేసుకుంటోంది.. సడెన్గా బయట నుంచి తలుపు పెట్టి తాళం వేసేశారు. చివరకు ఆమె కేకలు వేయడంతో తాళం తీశారు. ఇది జరిగింది ఏపీలోనే.. ఆ తాళం వేసింది మున్సిపల్ సిబ్బందే. పన్నులు చెల్లించలేదనే కారణంతో ఇలా ఇళ్లకు తాళాలు వేసి సీల్ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పన్నులు కట్టనంత మాత్రాన ఇలా ఇళ్లకు తాళాలు వేస్తారా? అని ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో పన్నులు చెల్లించని ఇళ్లకు మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది తాళం వేశారు. గొర్ల రమణ, గొర్ల సత్తిబాబు మున్సిపాలిటీకి ఇంటి, కుళాయి పన్ను చెల్లించకపోవడంతో రెండు ఇళ్లకు తాళాలు వేశారు. తాళం వేసే సమయంలో ఇంటి లోపల ఉన్న సత్తిబాబు భార్య లక్ష్మి కేకలు వేయడంతో అధికారులు తాళం తీశారు. గొర్ల మరణ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సీల్ వేసి నోటీసులు అంటించి వెళ్లారు. దీంతో మున్సిపల్ అధికారుల వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పన్నులు చెల్లించని వాళ్ల వస్తువులు జప్తు చేస్తామనే బ్యానర్లతో కొన్ని వాహనాలు రాష్ట్రంలో తిరగడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
వాటి ఫోటోలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జనాలు ప్రశాంతంగా బతకడం ఇష్టం లేని జగన్ ప్రభుత్వం ఇలా చెత్త పన్ను అంటూ.. బుద్ధిలేని చర్యలు తీసుకుంటుందోని పవన్ విమర్శించారు. ఇక మరోవైపు కర్నూలు నగరంలోని వివిధ వ్యాపారులు చెత్త పన్ను చెల్లించలేదని ఊర్లో చెత్తను తీసుకువచ్చి వాళ్ల వ్యాపార సముదాయాల ముందు గుమ్మరించడం తీవ్ర వివాదంగా మారింది.
ఇలా తమ దుకాణాల ముందు చెత్త పోసి అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఇలా మున్సిపల్ అధికారులు పన్ను వసూళ్ల కోసం తీసుకుంటున్న చర్యలు తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి. దీంతో ప్రజలు సీఎం జగన్పై కోపంతో మండిపడుతున్నారు. ఓట్లు వేసి గెలిపించుకున్న నాయకుడు.. ఇలా వివిధ పన్నుల పేరుతో తమను అవమానించడం దారుణమైన జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.