రాజస్థాన్ లోని ఒక పెళ్లింట పేలిన హోం థియేటర్ ఉదంతంలో పెళ్లి కొడుకు.. అతడి అన్న ప్రాణాలు కోల్పోయిన షాకింగ్ ఉదంతం గురించి తెలిసిందే. అయితే.. ఈ పేలుడు వెనుక పెళ్లి కుమార్తె మాజీ ప్రియుడి ప్లానింగ్ ఉందన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. సంచలనంగా మారిన ఈ విషాదంలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.
రాజస్థాన్ లోని కబీర్ ధామ్ జిల్లాలోని చమరి గ్రామానికి చెందిన హేమేంద్రకు మార్చి 31న దగ్గర్లోని గ్రామానికి చెందిన యువతితో పెళ్లైంది. ఏప్రిల్ ఒకటిన పెళ్లి రిసెప్షన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఒక హోం థియేటర్ కానుకగా వచ్చింది. సోమవారం దాన్ని బయటకు తీసిన హేమేంద్ర.. దానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వటం.. ఆ వెంటనే పెద్ద శబ్ధంతో పేలింది. దీని ధాటికి పెళ్లి కుమారుడు అక్కడికక్కడే మరణించగా ఆయన సోదరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
సాధారణంగా హోం థియేటర్లు పేలిన ఉదంతమే వినిపించదు. అందుకు భిన్నంగా పేలటం ఒక ఎత్తు అయితే.. ఆ తీవ్రతకు ఇద్దరి ప్రాణాలు పోయిన వైనంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా పెళ్లికుమార్తెకు గతంలో సర్జు అనే వ్యక్తితో లవ్ ఎఫైర్ ఉంది. ఆ తర్వాత అతడికి పెళ్లైంది. అయినప్పటికీ తాను ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లి చేసుకోవటాన్ని జీర్ణించుకోలేని అతడు.. హోం థియేటర్ లో బాంబు పెట్టి బహుమతిగా ఇచ్చాడు. అతనో ఆటో మెకానిక్ అని.. గతంలో స్టోన్ క్రషర్ ప్లాంటులోపని చేసిన అనుభవం ఉందని.. దాంతో అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించి బాంబులు తయారు చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు తీవ్రసంచలనంగా మారింది.