ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేత.. హోంశాఖా మంత్రిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయటం.. పని తీరును ప్రశ్నించటం.. వైఫల్యాల్ని ప్రజల ముందు ఎత్తి చూపటం లాంటివి చేసినప్పుడు ఎవరైనా నెగిటివ్ గా రియాక్టు అవుతారు. తాజా ఎపిసోడ్ లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఏపీ హోం మంత్రి అనిత ఆచితూచి అన్నట్లు స్పందించారు. పవన్ కల్యాణ్ ను పెద్దన్న మాదిరి వ్యవహరిస్తూ.. ఆయన చేసిన వ్యాఖ్యల విషయంలో తప్పు లేదన్న ధోరణిలోనే రియాక్టు అయ్యారు.
పవన్ కల్యాణ్ మాటలను బాధ్యతగా తీసుకొని కలిసి పని చేస్తామని చెప్పటం ద్వారా.. ఉప ముఖ్యమంత్రికి తానెంత ప్రాధాన్యతను ఇస్తానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. నిజానికిపవన్ వ్యాఖ్యల విషయంలో ఏ మాత్రం నెగిటివ్ వ్యాఖ్య ఒక్కటి చేసినా.. దాని కారణంగా జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం తనకు తెలుసన్న విషయాన్ని తన తాజా వ్యాఖ్యలతో స్పష్టం చేశారు.
మహిళలపై అఘాయిత్యాలు.. గంజాయి లాంటి అంశాలపై తాము చర్చించామని.. నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై తాము మాట్లాడుకున్నట్లుగా పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో చోటు చేసుకున్న గ్యాంగ్ రేప్ బాధాకరమన్న హోం మంత్రి.. అలాంటి వారిపై గతంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇలాంటివి జరిగేవి కావన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల విషయంలో అందరికీ బాధ ఉందన్న హోం మంత్రి.. ‘‘ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బయటపడ్డారు. మేం పడలేదు. లా అండ్ ఆర్డర్ సరిగా అమలు చేయటానికి క్రషి చేస్తున్నాం. శిక్షలు తక్షణం అమలు చేయటానికి ప్రత్యేక కోర్టులు కావాలి’’ అని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు ఉంటాయన్న ఆమె.. వైసీపీ పాలనలో పోలీసులు ఇబ్బందులు పడ్డారన్నారు. భావప్రకటన స్వేచ్ఛ ఇప్పుడు జగన్ కు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. పవన్ మాటల్ని బాధ్యతగా తీసుకొని కలిసి పని చేస్తామన్న అనిత మాటలు చూస్తే.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల విషయంలో ఆచితూచి అన్నట్లుగా రియాక్టు అయ్యారని చెప్పాలి.